గండికోటలోని జుమ్మామసీదు
జమ్మలమడుగు : గండికోట అభివృద్ధికి నోచుకోవడం లేదు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గండికోట.. అందాలతోపాటు అపురూపమైన శిల్పసంపదకు నిలయంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గండికోట అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోట, బెలూంగుహలను కలిపి ప్రత్యేక పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని కడపకు వచ్చిన ప్రతి సారి హామీలు ఇచ్చారే కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
గండికోటలో ఇటీవల తమిళ, కన్నడ, తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన వారు సినిమా షూటింగ్‌లు చేస్తున్నారు. అయినా మన ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి చేయడం లేదు. 2015 నవంబర్ 10న ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని, విదేశాల నుంచి పర్యాటకులు భారతదేశానికి వస్తే వారు కచ్చితంగా జమ్మలమడుగులోని గండికోట ప్రాంతాన్ని చూసే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అలాగే అమెరికాలోని గ్రాండ్ కెనాల్‌పై నిర్మించిన స్కైవాక్‌ను.. ఇక్కడి లోయ వద్ద ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. రెండున్నరేళ్లు దాటినా ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రెండు సార్లు గండికోట ఉత్సవాలను నిర్వహించినా అభివృద్ధి జరగలేదు.
బోర్డులకే పరిమితమైన బోటింగ్
మైలవరం జలాశయం నుంచి బోటింగ్ ఏర్పాటు చేస్తామని బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ బోటింగ్ లేకపోవడంతో అసంతృప్తితో తిరిగి వెళుతున్నారు. ఇక్కడ బోటింగ్ బోర్డులకే పరిమితమైంది. దీంతో పలువురు గండికోటలో ఉన్న పురాతన ఆలయాలతోపాటు జుమ్మామసీదు, పెన్నానది అందమైన లోయను చూసి వెళ్తున్నారు.
రహదారులు కూడా లేవు
గండికోటకు వచ్చే పర్యాటకులకు వివిధ ప్రాంతాలలో ఉన్న వాటిని చూడటం కోసం సరైన రహదారులు కూడా లేవు. జుమ్మా మసీదు నుంచి పెన్నానది లోయ వద్దకు వెళ్లేందుకు పెద్ద రాళ్లు ఎక్కి దిగి వెళ్లాల్సి వస్తోంది. సరైన రహదారిని కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో చాలా మంది వృద్ధులు నడవలేక అవస్థలు పడుతున్నారు.
సౌకర్యాలు లేవు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ బోటింగ్ ఉందని బోర్డుల పైన ఉంది. తీరా ఇక్కడ చూస్తే ఎటువంటి బోటింగ్ లేదు. హైదరాబాద్ నుంచి వచ్చాను. లోయ అందాలు చాలా బాగున్నాయి. భద్రత ఎక్కడా లేదు.– ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్.
Comments
Please login to add a commentAdd a comment