వారి నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తాం
నారా భువనేశ్వరి చెక్కుల పంపిణీపై కలెక్టర్ల నివేదిక కోరాం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
సాక్షి, అమరావతి: నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో జరిగిన హత్యలు, పల్నాడు జిల్లాలో కారు దహనంపై ఆ మూడు జిల్లాల ఎస్పీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు వివరణ ఇచ్చారు. సీఈవో మీనా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీరా రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలోని సీఈవో కార్యాలయానికి వచ్చారు.
అక్కడ సీఈవో ముఖేష్ కుమార్ మీనా, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) శంకబ్రత్ బాగ్చీ ఎదుట హాజరై ఆ సంఘటనలకు దారి తీసిన పరిస్థితులు, అనంతరం తాము చేపట్టిన చర్యలపై నివేదికలు అందజేశారు. అనంతరం సీఈవో మీనా విలేకరులతో మాట్లాడుతూ గిద్దలూరులో జరిగినది రాజకీయ హింసేనని ఎస్పీ నివేదిక ఇచ్చారని తెలిపారు.
ఆళ్లగడ్డలో జరిగిన హత్య కుటుంబ కక్షల వల్ల జరిగిందని ఆ జిల్లా ఎస్పీ వివరించారన్నారు. మాచర్లలో రెండు వర్గాల ఘర్షణ సందర్భంగా కారు దహనం జరిగిందని, గురువారం రాత్రిలోగా నిందితులను అరెస్ట్ చేస్తామని పల్నాడు ఎస్పీ చెప్పినట్లు తెలిపారు. ఎస్పీలు ఇచ్చిన నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీకి) సమర్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, రీపోలింగ్ లేకుండా నిర్వహించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. రాజకీయ హింసను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
చెక్కులు పంపిణీ చేస్తే కోడ్ ఉల్లంఘనే
నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు కోరినట్లు మీనా తెలిపారు. డబ్బులు పంపిణీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చేపట్టిన పరామర్శ యాత్ర కొనసాగించవచ్చని, కానీ చెక్కులు పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరింది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరిందని మీనా తెలిపారు. ఈ సభలో భద్రత వైఫల్యంపై వివిధ రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సభలో జరిగిన సంఘటనలపై వాస్తవాలను సమర్పించాలని ఈసీ కోరిందని, త్వరలోనే పూర్తి వివరాలను తెప్పించుకొని నివేదిక పంపుతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment