భక్తజన సందోహం మధ్య కదులుతున్న నృసింహస్వామి రథం
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి రథోత్సవం మంగళవారం నయనానందకరంగా సాగింది. సంపద్రాయబద్ధంగా సాగిన రథయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు అంతర్వేదికి పోటెత్తారు. మెరక వీధిలో మధ్యాహ్నం 2.30 గంటలకు రథయాత్ర మొదలైంది. కళ్యాణమూర్తులను రథం మీద ఉంచి పురవీధుల్లో ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు. స్వామివారు కళ్యాణ అనంతరం రథం మీద వెళ్లి తన సోదరి గుర్రాలక్కకు చీర, సారె పెట్టడం సంప్రదాయంగా వస్తోంది.
మొగల్తూరుకు చెందిన ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్, ముఖ్యఅతిథిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.. కొబ్బరికాయలు కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇటీవల కొంతమంది గుర్తుతెలియని దుండగులు అంతర్వేది రథాన్ని దగ్ధంచేయడం.. రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన కొత్త రథాన్ని తయారుచేయించడం.. అనంతరం కళ్యాణోత్సవాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ దీనిని ఇటీవలే ప్రారంభించడం తెలిసిందే. కాగా, కొత్త రథాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారి కళ్యాణ సమయం కన్నా రథయాత్ర సమయంలోనే ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. ముస్తాబు చేసిన కొత్తరథాన్ని తాకి పులకించిపోయారు.
పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు
మరోవైపు.. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున సముద్ర సంగమ ప్రాంతంలో జరిగిన పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. అంతర్వేది బీచ్ నుంచి సంగమ ప్రాంతం వరకు సుమారు కిలోమీటరు మేర భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.13 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సోమవారం అర్ధరాత్రి కల్యాణ వేదిక వద్ద అసంఖ్యాకమైన భక్తుల సమక్షంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో భక్తులు హర్షధ్వానాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment