రుషికొండపై నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం
దొండపర్తి (విశాఖ దక్షిణ): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం విశాఖపట్నంలో ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. తూర్పున బంగాళాఖాతానికి అభిముఖంగా సాగరతీరంలో కొండపై శ్రీవారు కొలువుదీరుతున్నాడు. పర్యాటక అందాలకు తోడు ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లేలా ఈ ఆలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది.
ఆధ్యాత్మిక కేంద్రంగా రుషికొండ
తిరుమలలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మాదిరిగా రుషికొండలో ప్రకృతి రమణీయతల మధ్య ఈ ఆలయ నిర్మాణాన్ని టీటీడీ 2019లో చేపట్టింది. సాగర తీరానికి ఎదురుగా గీతం యూనివర్సిటీకి పక్కనే ఉన్న కొండపై నెలకొల్పుతున్నారు. సముద్ర మట్టానికి 60 మీటర్ల ఎత్తులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.28 కోట్ల నిధులతో టీటీడీ ఈ ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. చిన్న తిరుపతి స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ ఆలయం ఎదురుగా బేడాంజనేయ స్వామి ఆలయాన్ని ఏర్పాటుచేశారు. మూల విరాట్‌కు ఒకవైపు పద్మావతి అమ్మవారి ఆలయం, మరోవైపు ఆండాళ్ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు.
తిరుపతిలో ఎస్వీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషినల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ వారితో శ్రీవారు, అమ్మవార్ల విగ్రహాలను తయారుచేయించారు. బీచ్ రోడ్డులో వెళ్లే వారికి కనువిందు చేసేలా విద్యుద్దీపకాంతులతో కొండపై శంఖు, చక్ర, నామాలను ఏర్పాటుచేశారు. ప్రధానాలయం కింద ప్రత్యేకంగా ధ్యాన మందిరం, పూజలు, పెళ్లిళ్ల కోసం 100 నుంచి 150 మందికి సరిపడేలా ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. బీచ్ రోడ్డు నుంచి కొండపైకి సుమారు అర కిలోమీటర్ మేర ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. కొండ కింద భారీ పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. భక్తులు విశ్రాంతి తీసుకోడానికి, టికెట్లు, ప్రసాద కౌంటర్లను సైతం ఏర్పాటుచేస్తున్నారు. ఈ ఆలయంలో ఇద్దరు ప్రధాన పూజారులు ఉండనున్నారు. ఆలయం సమీపంలోనే అర్చకుల కోసం క్వార్టర్స్‌ను సిద్ధంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment