
కర్ఫ్యూ వేళల్లో చేసిన మార్పులకు అనుగుణంగా శ్రీశైల మల్లన్న దర్శన వేళలను మార్పు చేశారు.
శ్రీశైలం టెంపుల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో చేసిన మార్పులకు అనుగుణంగా శ్రీశైల మల్లన్న దర్శన వేళలను మార్పు చేశారు. సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు తెరిచినప్పటి నుంచి రాత్రి మూసివేసే వరకు రోజువారీ కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. వీటిని అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు.
23న కాణిపాక దర్శన వేళల్లో స్వల్ప మార్పు
కాణిపాకం (యాదమరి): చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 23న స్వామివారి దర్శన వేళలలో స్వల్ప మార్పు చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశు ఆదివారం తెలిపారు. ఆ రోజు స్వామివారి ప్రధాన ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు చెప్పారు. పూజల అనంతరం దర్శనాలు ఉంటాయని వెల్లడించారు.
శ్రీభోగ శ్రీనివాసునికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
తిరుమల: శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకం చేశారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల నడుమ ఆలయంలోని బంగారువాకిలి చెంత ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు.
నేడు సుందరకాండ అఖండ పారాయణం
కరోనా నుంచి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూన్ 21న 15వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సుందరకాండలోని 59 నుండి 64వ సర్గ వరకు గల 174 శ్లోకాలను పారాయణం చేస్తారు.