తిరుపతిలో ఏర్పాటు చేసిన చిన్నారుల హృదయాలయం
తిరుపతి తుడా: చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు, సంబంధిత చికిత్సల కోసం ఇక పొరుగు రాష్ట్రాల్లోని మహానగరాలకు వెళ్లాల్సిన పనిలేదు. అత్యాధునిక వైద్య సామర్థ్యంతో చిన్నపిల్లల హృదయాలయాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి బర్డ్ ఆస్పత్రి వేదికగా శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ఏర్పాటు చేసింది. చిన్నారుల గుండెకు చిల్లులుపడి సరైన చికిత్స అందక ప్రాణాలను వదులుకునే పరిస్థితిని చూసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలించిపోయారు. ఇలాంటి పిల్లలకు ఉచితంగా చికిత్స అందించేలా ఆరోగ్యశ్రీని అమలు చేశారు.
వేలమందికి పునర్జన్మను ప్రసాదించారు. చిన్నారుల గుండెకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని భావించారు. అదేబాటలో నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నపిల్లల కోసం ప్రత్యేక కార్డియాక్ సెంటర్ ఏర్పాటుకు సంకల్పించారు. ఈ బాధ్యతల్ని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డికి అప్పగించారు. ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ఆరునెలల్లో ప్రారంభానికి సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ చిన్నపిల్లలకు ప్రత్యేక కార్డియాక్ సెంటర్ ఇప్పటివరకు లేని లోటును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీర్చారు.
తిరుపతిలో ఏర్పాటైన శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ఈనెల 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. చిన్నపిల్లల కార్డియోథొరాసిక్ సర్జన్లు ముగ్గురు, కార్డియాక్ నిపుణులు, పీడియాట్రీషియన్లు, మత్తు వైద్యనిపుణులు ఐదుగురు వంతున, మెడికల్ ఆఫీసర్లు 10 మంది, నర్సులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది 185 మందితో ఆస్పత్రిని సిద్ధం చేశారు. దేశంలోని ప్రముఖ చిన్నపిల్లల కార్డియాక్ వైద్యనిపుణుల సేవలను కూడా ఉపయోగించుకోనున్నారు. ఉచితంగా ఆస్పత్రికి వచ్చి చిన్నపిల్లలకు అరుదైన ఆపరేషన్లు చేసేందుకు వీలుగా వైద్య నిపుణులను ఆహ్వానిస్తూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ విధానం ప్రస్తుతం బర్డ్ ఆస్పత్రిలో విజయవంతంగా నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment