సాక్షి, న్యూఢిల్లీ/తిరుపతి కల్చరల్/నెల్లూరు(దర్గావిుట్ట)/తిరుమల: జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి (సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ, శ్రీవారి కళ్యాణం గురువారం ఆగమోక్తంగా జరిగింది. సుప్రభాతం అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు యాగశాలలో మహాపూర్ణాహుతి, కుంభప్రదక్షిణ చేపట్టారు.
ఉదయం 7.30 నుంచి 8.15 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ, కళావాహన నిర్వహించారు. ఈ క్రతువుల ద్వారా యాగశాలలోని కలశాలలో ఇమిడి ఉన్న దేవతాశక్తిని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాల్లోకి ఆవాహన చేశారు. అనంతరం అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం అందించారు.
ఉదయం 10 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, కిషన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ ట్వీట్..
జమ్మూలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. శ్రీ బాలాజీ ఆలయ నిర్మాణాన్ని భిన్నత్వంలో ఏకత్వ వేడుకగా కేంద్రమంత్రి జితేందర్ సింగ్ అభివర్ణించారు.
జమ్మూలోని శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన ఏపీ సీఎం జగన్, టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. హిందూ సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని పెద్దఎత్తున చేపట్టామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment