మాట్లాడుతున్న మధుసూదనరాజు
సాక్షి, అమరావతి/అనంతపురం శ్రీకంఠం సర్కిల్/నెల్లూరు(పొగతోట): ఏపీ జేఏసీవి అవకాశవాద ఉద్యమాలని.. ఇంతకాలం ఆగినవాళ్లు పది రోజులు ఆగలేకపోయారా అని రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు మండిపడ్డారు. తమ అభిప్రాయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏపీ జేఏసీ నాయకులపై ఉద్యోగులు నమ్మకం కోల్పోయారన్నారు. సీఎం జగన్ హామీ ఇచ్చిన తర్వాత కూడా నిరసనలెందుకని ప్రశ్నించారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో ఇది జేఏసీ విజయమని చెప్పుకోవడానికే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ మీద నమ్మకంతో జేఏసీ ఆందోళనల్లో గ్రంథాలయ ఉద్యోగులెవరూ పాల్గొనడం లేదని తెలిపారు. సమావేశంలో నాయకులు «శివశంకరప్రసాద్, నరసింగరావు, శివారెడ్డి, కమ్మన్న తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయం వద్దు..
ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయాలు చేయొద్దని, ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించవద్దని ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంజనాయక్, ఎన్‌ఆర్‌కే రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి న్యాయం చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏనాడు సకాలంలో జీతాలు చెల్లించలేదని చెప్పారు.
నిరసనలకు మేము దూరం..
పీఆర్సీ గురించి సీఎం జగన్ ఇచ్చిన హామీపై తమకు పూర్తిస్థాయిలో నమ్మకముందని ఏపీ రెవెన్యూ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మొలతాటి గిరీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసనలు తెలుపుతున్న వారికి సీఎం మాటపై గౌరవం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సమయమివ్వకుండా అనాలోచిత ఆందోళనలేమిటని నిలదీశారు. రెండు జేఏసీల నిరసనల్లో తమ అసోసియేషన్ ఉద్యోగులెవరూ పాల్గొనరని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment