బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
17న పుదుచ్చేరి–నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం
నేటి నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు
రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ అధికారుల వెల్లడి
ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో జోరుగా వానలు
నెల్లూరు జిల్లా ఊటుకూరులో 15 సెం.మీ. వర్షపాతం నమోదు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి మళ్లీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కి.మీ., పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కి.మీ, నెల్లూరు(ఆంధ్రప్రదేశ్)కి ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది ఈ నెల 17వ తేదీన తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చి మ–వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరుకు సమీపంలో తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
పలుచోట్ల భారీ వర్షాలు
ఇప్పటికే రెండు రోజుల నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా విడదలూరు మండలం ఊటుకూరులో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా 15.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అల్లూరి మండలం ఇసుకపల్లిలో 14.6, తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరంలో 13.5, ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం దేవరంపాడులో 13.3, నెల్లూరు జిల్లా కావలి, ఉలవపాడు మండలం కారేడులో 13.2, కొడవలూరులో 12.4, బుచ్చిరెడ్డిపాలెంలో 11.4 సెంటీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద మంగళవారం సముద్రపు కెరటాలు 5 మీటర్లు ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. దాదాపు 8 నుంచి 10 మీటర్లు వరకు సముద్రం ముందుకు రావడంతో తీరం కోతకు గురవుతోంది.
అప్రమత్తంగా ఉండండి: సిసోడియా
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అత్యవసరమైతే శాటిలైట్ ఫోన్లు వినియోగించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
‘నైరుతి’కి సెలవు
నైరుతి రుతుపవనాలు దేశమంతటి నుంచి ఉపసంహరణ పూర్తయింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా రాష్ట్రంపై ప్రభావం చూపాయి. జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు చూస్తే.. సాధారణంగా 686 మి.మీ. సగటు వర్షపాతం కాగా.. 10.7 శాతం అధికంగా వర్షాలు కురిసింది. నైరుతి సీజన్‌లో 758.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment