సాక్షి, అమరావతి: టీటీడీలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలును తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు హైకోర్టు నిలుపుదల చేసింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం ఏపీ దేవదాయ చట్టం సెక్షన్ 96కు అనుగుణంగా లేదని తెలిపింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలకు సెక్షన్ 96 వీలు కల్పించడం లేదంది. దీనిపై క్షుణ్నంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని, వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోలకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేస్తూ సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 568, 569 జీవోలను సవాల్ చేస్తూ టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు, హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కాకుమాను లలితకుమార్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రత్యేక ఆహ్వానితుల నియామకంతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత జి.భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిల్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది.
గతంలోనూ నియామకాలు..
బోర్డు సభ్యుల నియామకం నిబంధనలకు అనుగుణంగానే ఉన్నా ప్రత్యేక ఆహ్వానితుల నియామకం మాత్రం చట్ట విరుద్ధంగా ఉందని పిటిషనర్ ఉమామహేశ్వరనాయుడు తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ తోసిపుచ్చారు. ప్రత్యేక ఆహ్వానితులు టీటీడీ బోర్డుకు సంబంధించిన వారు కాదన్నారు. వారు కేవలం టీటీడీ దేవస్థానానికి మాత్రమే ఆహ్వానితులన్నారు. వీరి నియామకంపై చట్టంలో ఎలాంటి నిషేధం లేదన్నారు. ప్రత్యేక ఆహ్వానితులకు బోర్డు సభ్యులతో సమానమైన అధికారాలు ఉండవన్నారు.
పాలక మండలి సమావేశాల్లో పాల్గొనడం, ఓటింగ్ లాంటి అధికారాలు ప్రత్యేక ఆహ్వానితులకు లేవని వివరించారు. ప్రత్యేక ఆహ్వానితుల అధికారాల విషయంలో పిటిషనర్లు తప్పుగా అర్థం చేసుకున్నారని నివేదించారు. కేవలం దర్శనం వరకే బోర్డు సభ్యులతో సమాన అధికారాలు ఉంటాయన్నారు. గతంలో కూడా ప్రత్యేక ఆహ్వానితుల నియామకం జరిగిందన్నారు. నియామకాలపై అభ్యంతరాలుంటే పిటిషనర్లు వినతిపత్రం రూపంలో టీటీడీ దృష్టికి తేవచ్చని, అయితే నేరుగా హైకోర్టును ఆశ్రయించారని టీటీడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ ఎస్.సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు.
ఆ ఒక్క కారణంతో పిల్‌ను కొట్టేస్తాం...
బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. బోర్డు సభ్యులపై ఆరోపణలు చేస్తూ ప్రతివాదులుగా చేయకపోవడం ఏమిటని ప్రశ్నించింది. ఈ ఒక్క కారణంతో వ్యాజ్యాన్ని కొట్టేస్తామంటూ అందుకు సిద్ధపడింది. ఈ దశలో భాను ప్రకాశ్‌రెడ్డి న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ స్పందిస్తూ సభ్యులుగా నియమితులైన వారిలో పలువురిపై క్రిమినల్ కేసులున్నాయని, అలాంటి వారు బోర్డు సభ్యులుగా ఉండరాదన్నారు. ఇవన్నీ ఈ దశలో తమకు అవసరం లేదని, సభ్యులపై ఆరోపణలు చేస్తూ ప్రతివాదులుగా చేయనందున వ్యాజ్యాన్ని కొట్టేస్తామని పునరుద్ఘాటించింది. గడువు ఇస్తే ప్రతివాదులుగా చేరుస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తానని అశ్వనీ నివేదించడంతో అందుకు సమ్మతిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 6కి న్యాయస్థానం వాయిదా వేసింది.
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జీవోలపై స్టే
Published Thu, Sep 23 2021 4:43 AM | Last Updated on Thu, Sep 23 2021 4:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment