
సాక్షి, అమరావతి: టీటీడీ ప్రత్యేక ఆహ్వానితునిగా కొనసాగేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి హైకోర్టు అనుమతిచ్చింది. 52 మందిని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలను సవాలు చేస్తూ పిల్ దాఖలు కావడం.. ఆ జీఓలపై స్టే విధించడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి.
గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ భూమన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. భూమన స్థానిక ఎమ్మెల్యే అయినందున ఆయన విషయంలో స్టే ఉత్తర్వులను సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఆహ్వానితుల విషయంలో స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం నిమిత్తం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి, పిటిషనర్లకు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment