ఆదోని, పెనుకొండ కాలేజీల పనులు ఆపేయాలని సర్కార్ హుకుం
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయడంలో భాగంగానే ఆదేశాలు
పీపీపీ విధానంలో అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం
17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం
ఐదు పూర్తయ్యి గతేడాది 750 సీట్లు అందుబాటులోకి..
ఈ ఏడాది మరో 5 ప్రారంభానికి చర్యలు తీసుకున్న గత సర్కార్
ఆ ప్రక్రియను కొనసాగించి ఉంటే మరో 750 సీట్లు అందుబాటులోకి
పేద విద్యార్థుల ఆశలకు గండి కొట్టేలా చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు
సాక్షి, అమరావతి: ప్రైవేట్‌పై మోజుతో ప్రభుత్వ వైద్యాన్ని నిరీ్వర్యం చేసే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో అడుగు
ముందుకేసింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించిన క్రమంలో కళాశాలల నిర్మాణం ఆపివేయాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు ఏపీఎంస్‌ఐడీసీ చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కర్నూలు జిల్లా ఆదోని, సత్యసాయి జిల్లా పెనుకొండ వైద్య కళాశాలల నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కర్నూలు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు వీల్లేదన్నారు.
నిజానికి ఈ విద్యాసంవత్సరంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లెలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది. ఈ ఐదు మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రక్రియను చంద్రబాబు సర్కార్ కొనసాగించి ఉంటే కాలేజీకి 150 చొప్పున ఈ ఏడాది 750 సీట్లు అందుబాటులోకొచ్చేవి. ప్రైవేట్‌పై ప్రేమతో వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. ఒక్క పాడేరు వైద్య కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు ఎన్‌ఎంసీ అనుమతి ఇచి్చంది. 150 సీట్లు రావాల్సిన చోట కేవలం మూడో వంతే అందుబాటులోకొచ్చాయి. పులివెందులలో 50 సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వకపోవడంతో ఆ సీట్లు కోల్పోవాల్సి వచి్చంది.
ఇక ఉచిత వైద్యం ఊసుండదు
ప్రతి జిల్లాలో ప్రభుత్వ రంగంలోనే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్న లక్ష్యంతో రూ. 8 వేల కోట్లకుపైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి, ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే లక్ష్యం. కాగా, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యా, వైద్యానికి పేద, మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బు గుంజాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. పీపీపీ విధానంలో ప్రైవేట్ అజమాయిషీలోకి బోధనాస్పత్రులు వెళితే ఉచిత వైద్యం ఊసే ఉండదని, పీపీపీ విధానం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇదే జరుగుతోందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు.
బాబు హయాంలో ప్రైవేట్‌కు పచ్చజెండా
గతంలో 1994 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో, అనంతరం 2014–19 విభజిత ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా వాటిలో చంద్రబాబు పాలనలో ఏర్పాటైనవి ఒక్కటీ లేదు. ప్రస్తుతం 18 ప్రైవేట్ వైద్య కళాశాలలుండగా 12 కళాశాలలకు చంద్రబాబు పాలనలోనే అనుమతులు లభించాయి. గతంలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా కొనసాగినా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు బాబు కృషి చేయలేదు. ప్రస్తుతం బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్రంలోనూ అనుకూల పరిస్థితులున్నా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నారు.
వైఎస్ జగన్ హయాంలో 17 కొత్త కాలేజీలు
వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదింటిని గతేడాది ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను ఒకే ఏడాది సమకూర్చారు. ఈ ఏడాది మరో ఐదు కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ పీపీపీ మోడల్ పేరిట కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment