‘చేయూత’తో స్వయం సమృద్ధి | Story On The YSR Cheyutha Scheme | Sakshi
Sakshi News home page

‘చేయూత’తో స్వయం సమృద్ధి

Published Tue, Aug 25 2020 8:35 AM | Last Updated on Tue, Aug 25 2020 8:35 AM

Story On The YSR Cheyutha Scheme - Sakshi

స్వయం సమృద్ధి దిశగా అడుగులేస్తోంది మహిళా లోకం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘వైఎస్సార్‌ చేయూత’తో తమ కాళ్లపై తాము నిలబడాలని యత్నిస్తోంది.  నడివయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నవరత్నాల్లో భాగమైన ఈ పథకం ద్వారా 45–60 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు నాలుగేళ్లపాటు రూ.75 వేలు ఆర్థికసాయం  అందిస్తోంది. తొలివిడతగా ఈ నెల 12న ఒక్కొక్కరికీ రూ.18,750ల చొప్పున జిల్లాలో 1,81,025 మందికి రూ.339.42 కోట్లు జమ చేసింది. అసలు మొత్తానికి మూడింతలు బ్యాంకు ద్వారా ఆర్థిక చేయూతనిచ్చి ప్రతి ఒక్కర్ని ఓ పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. ఇందుకోసం అమూల్‌ డెయిరీ, హెచ్‌యూఎల్,పీ అండ్‌ జీ, ఐటీసీ, రిలయన్స్‌ వంటి ప్రసిద్ధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. త్వరలో రిలయన్స్‌ ఫ్రెష్, జియో మార్ట్‌లతో  కూడా అవగాహన చేసుకోనుంది. 

సాక్షి, మచిలీపట్నం: నవరత్నాల్లో భాగమైన ఈ పథకం జిల్లాలో 1,81,025 మందికి లబ్ధి చేకూరిన సంగతి తెలిసిందే.  వీరికి మూడింతల బ్యాంకు సాయం  చేయూత ద్వారా మొదటి విడతగా ఇచ్చిన రూ.18,750ల ఆర్థిక సహాయానికి తోడుగా బ్యాంకు నుంచి మరో రూ.56,250లు రుణం ఇప్పించి ప్రముఖ కంపెనీలతో అనుసంధానం చేస్తారు. రుణాన్ని నిర్ణీత గడువులో చెల్లిస్తే ప్రతీ ఏటా వైఎస్సార్‌ చేయూత ఆర్థికసాయంతో పాటు బ్యాంకు నుంచి వరుసగా రెండోసారి, మూడోసారి, నాల్గోసారి కూడా రుణం మంజూరు చేస్తారు.

ఉదాహరణకు చేయూత సహాయం, బ్యాంకు అప్పు కలిపి తొలి ఏడాదిలో ఒక ఆవు లేదా గేదె కొనుగోలు చేసి పాలవ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిర్ణీత గడువులోగా చెల్లిస్తే రెండో ఏడాది మరొక ఆవు, గేదె కొనుగోలుకు అప్పు ఇస్తారు. ఇలా నాలుగేళ్ల పాటు చేయూత సాయంతో కలిపి బ్యాంక్‌ ద్వారా పొందే రుణంతో మినీ డెయిరీని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ విధంగా పాడి పశువులు కొనుగోలు, పాల అమ్మకం, అగరబత్తీల తయారీ, కూర గాయ లు, పండ్ల తోటల పెంపకం, అమ్మకం, కిరణా, జనరల్‌ స్టోర్స్‌ ఏర్పాటు వంటి జీవనోపాదులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక చేయూత నివ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది.  

లబ్ధిదారుల్లో 95.70 శాతం సముఖత  
బహుళ జాతి కంపెనీలతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చే వారిని గుర్తించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా చేయూత లబ్ధిదారుల్లో 1,73,235 మంది ముందుకొచ్చారు. వీరిలో ఆవులు కొనుగోలుకు 1907 మంది, గేదెల కోసం 31235 మంది, గొర్రెలు కోసం 5329 మంది, మేకల కోసం 3721 మంది ముందుకు రాగా, కిరాణా వ్యాపారం కోసం 9095 మంది, పండ్ల వ్యాపారాల కోసం 4375 మంది, అగరబత్తీలు తయారీ కోసం 412 మంది, కూరగాయల వ్యాపారం కోసం 8 వేల మంది ఇతర వ్యాపారాల కోసం మరో 1,09,161 మంది అంగీకారం తెలిపారు. ఈ విధంగా ఇప్పటి వరకు మొత్తం చేయూత లబ్ధిదారుల్లో 95.70 శాతం మంది ముందుకొచ్చారు.

కిరాణా వ్యాపారం చేస్తా 
కిరాణా కొట్టు పెట్టుకోవాలని ఉన్నా, సాయం అందించే వారు లేక ఇప్పటి వరకు పెట్టుకోలేదు. ఇప్పుడు సీఎం చేయూత ద్వారా మొదటి విడత రూ. 18,750 అందింది. బ్యాంకు నుంచి లోన్‌ తీసుకుని కిరాణా కొట్టు పెట్టుకుంటా. వచ్చే ఆదాయంతో బ్యాంకు అప్పుకట్టి మిగిలినవి కుటుంబాన్ని     పోషించుకుంటా. 
–తిరువీధుల గ్రేసమ్మ, కోటకలిదిండి, కలిదిండి మండలం 

బడ్డీకొట్టు పెట్టుకుంటా  
చేయూత పథకం ద్వారా మొదటి విడత రూ. 18,750లు జమయ్యాయి. బడ్డీకొట్టు పెట్టుకుందామని అనుకుంటున్నా. బ్యాంకు ఇచ్చే లోన్‌తో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందామనుకుంటున్నా. నాలుగు      విడతలుగా రూ. 75 వేలు చేయూత డబ్బుతో వచ్చే నగదుతో వ్యాపారాభివృద్ధి చేస్తాం. 
–రామనబోయిన సత్యావతి, ఇందిరానగర్, విస్సన్నపేట  

హోటల్‌ అభివృద్ధి చేసుకుంటా
నాకు నలుగురు పిల్లలు, చిన్న హోటల్‌ నడుపుతున్నా. కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉండేది. వైఎస్సార్‌ చేయూత కింద నాకు రూ. 18,750లు జమయ్యాయి. రూ.56 వేలు బ్యాంకు లోను ఇప్పిస్తామన్నారు. ఈ సొమ్ములతో హోటల్‌ను అభివృద్ధి చేసుకుంటా. మాకు బ్రతుకు దెరువు చూపిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. 
– నారగాని జయమ్మ, మండవల్లి  

 ఉప్పు, ముగ్గు వ్యాపారం చేస్తా  
మేము నిరుపేదలం. నేను, నా భర్త కూలీ పనులకు వెళ్లేవాళ్లం   వైఎస్సార్‌ చేయూత పథకం నుంచి రూ. 18,750లు జమైంది. చేయూత సొమ్ముతో పాటు డ్వాక్రా సంఘం నుంచి రూ. 41,250లు అప్పుగా తీసుకుని మొత్తం రూ. 60 వేలతో ఉప్పు, ముగ్గు వ్యాపారాన్ని చేస్తూ నా కాళ్లపై నేను నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటా. 
–కూతాడ నాగమణి, పెదకళ్లేపల్లి గ్రామం, మోపిదేవి మండలం

స్పందన బాగుంది 
ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని   సద్వినియోగం చేసుకుని ప్రముఖ కంపెనీలతో కలిసి చేయూత లబ్ధిదారులు ముందుకొస్తున్నారు. ఇలా ముందుకొచ్చే వారి జాబితా ను బ్యాంకులకు పంపి ఆ మేరకు ఆర్థిక చేయూత అందేలా కృషి చేస్తాం. సమీప భవిష్యత్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు ఈ ప్రయోగం దోహదపడుతుందనడంలో సందేçహం లేదు. 
– ఎం.శ్రీనివాసరావు, పీడీ, డీఆర్‌డీఏ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement