కోడుమూరు రూరల్: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీటెక్ విద్యార్థిని ప్రాణం నిలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన గుర్రం క్రిష్ణయ్య 108లో డ్రైవర్, ఆయన భార్య నాగలక్ష్మమ్మ అంగన్‌వాడీ టీచర్. వీరి కుమార్తె జాన్వీకౌసిక్ ఒంగోలులోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలికి గడ్డ ఏర్పడి.. అది క్రమంగా క్యాన్సర్‌గా మారింది. తల్లిదండ్రులు కర్నూలు, తిరుపతి, విజయవాడలో చూపించగా.. వైద్యులు ఆరు నెలలకు మించి ఆమె బతకదని, హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
ఆశతో అక్కడికి వెళ్లగా రూ.7 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసేందుకు కూడా పరిమితి దాటిందని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టి చూపించే స్థోమత లేక వెనుదిరిగారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడంతో ఆయన ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చూశారు. దీంతో విద్యార్థినికి మార్చి నెలలో బసవతారకం ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది.
ఆగస్టులో విద్యార్థిని క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోనుండటంతో ఆ తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు. ఎన్నో ఆస్పత్రులు తిరిగి పాప ప్రాణం దక్కదని ఆశలు వదులుకున్న దశలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రూపంలో సీఎం జగన్ తమ బిడ్డ ప్రాణాలు కాపాడారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. జగనన్న వల్లే తాను కోలుకుంటున్నానని విద్యార్థిని జాన్వీకౌసిక్ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment