నిబంధనలకు విరుద్ధంగా పీఎస్‌ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీలపై సర్కారు వేటు
గతంలో న్యాయస్థానం అనుమతితోనే కాదంబరి జత్వానీ అరెస్టు
అయినా అక్రమ అరెస్టు అంటూ సస్పెన్షన్
ఒక్క ఆధారం చూపకుండానే కక్షపూరిత చర్యలు
విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన
ప్రభుత్వ పెద్దల కుట్రలో పాత్రధారులుగా విజయవాడ పోలీసులు
క్యాట్‌ను ఆశ్రయించనున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అమలుచేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు చర్యలు పతాకస్థాయికి చేరుతున్నాయి. ఇందుకోసం పోలీసు వ్యవస్థనే భ్రష్టుపట్టించేందుకు బరితెగిస్తోంది. అందులో భాగంగానే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్‌గున్నీలను సస్పెండ్ చేస్తూ ఆదివారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ‘వలపు వల(హనీ ట్రాప్) వేసి బడా బాబులను బురిడీకొట్టించే కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు.
చంద్రబాబు ప్రభుత్వ కథా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో సాగిన ఈ కక్ష సాధింపు కుట్ర కోసం ఏకంగా న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడమే కాదు.. నిబంధనలనూ తుంగలో తొక్కారు. ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించకుండానే వారిని సస్పెండ్ చేయడంపట్ల పోలీసు వర్గాలు విభ్రాంతి వ్యక్తంచేస్తున్నాయి.
విచారణ అధికారిగా జూనియర్ అధికారి..
సాధారణంగా.. ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులు వస్తే విచారణకు పాటించాల్సిన నిబంధనలను నిర్భీతిగా చంద్రబాబు సర్కారు ఉల్లంఘించింది. సస్పెన్షన్‌కు గురైన ముగ్గురిలో పీఎస్‌ఆర్ ఆంజనేయుడు డీజీ స్థాయి, కాంతిరాణ ఐజీ స్థాయి, విశాల్ గున్నీ డీఐజీ స్థాయి అధికారులు. వారిపై ఫిర్యాదులొస్తే వారికంటే ఉన్నతస్థాయి అధికారినిగానీ సమానస్థాయి అధికారికిగానీ విచారణ బాధ్యతలు అప్పగించాలి. కానీ, వారికంటే జూనియర్ అయిన ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్న విజయవాడ డీసీపీ స్రవంతి రాయ్‌ను విచారణాధికారిగా నియమించడం గమనార్హం.
ఆమె కూడా నిబంధనలను పాటించకుండానే విచారణ తంతు ముగించారు. ఫిర్యాదు వచ్చిన ముగ్గురు పోలీసు అధికారులను ఆమె కనీసం సంప్రదించనే లేదు. పైగా వారి నుంచి వివరాలు తెలసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ వాంగ్మూలాలు నమోదుచేయాలన్న కనీస నిబంధనను కూడా పాటించకపోవడం విడ్డూరం. మరి స్రవంతి ఏ ప్రాతిపదికన విచారణ నిర్వహించారన్నది అంతుబట్టడమే లేదు. ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లుగానే ఆమె ఏకపక్షంగా నివేదిక సమర్పించారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ వ్యవహారం అంతా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు కనుసన్నల్లోనే సాగినట్లు స్పష్టమవుతోంది. విచారణ ప్రక్రియ సక్రమంగా నిర్వహించారా లేదా అన్నది డీజీపీ కూడా పరిశీలించనే లేదు. ప్రభుత్వ ‘ముఖ్యనేత’ ఆదేశాల ప్రకారం ఈ ముగ్గుర్ని ఏకపక్షంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇదే కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను కొన్నిరోజుల క్రితమే సస్పెండ్ చేశారు.
ఏకపక్షంగా సస్పెన్షన్ ఉత్తర్వులు..
పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేస్తూ జారీచేసిన ఉత్తర్వుల్లో అందుకు ఒక్క ఆధారాన్ని కూడా ప్రభుత్వం చూపించలేదు. ముంబై నటి కాదంబరి జత్వానీని నిబంధనలకు విరుద్ధంగా అరెస్టుచేసినందునే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. కానీ, ఆమె అరెస్టు ఎలా అక్రమం అనేందుకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదు. ఎందుకంటే కాదంబరి జత్వానీ అరెస్టు అంశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి విజయవాడ పోలీసు అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారు. అదెలాగంటే..
⇒ విజయవాడ న్యాయస్థానం నుంచి సెర్చ్ వారంట్ తీసుకుని మరీ పోలీసులు ముంబై వెళ్లారు.
⇒ కాదంబరి జత్వానీని అరెస్టుచేసే విషయాన్ని ముంబై పోలీసులకు ముందుగానే తెలిపారు. వారి సహకారంతో వారి సమక్షంలోనే ఆమెను అరెస్టుచేశారు.
⇒ అనంతరం కాదంబరి జత్వానీ అరెస్టుకు సంబంధించిన పంచనామా నివేదికను ముంబై న్యాయస్థానానికి సమర్పించారు.
⇒ దాంతో ఆమె అరెస్టు సక్రమమేనని ముంబై న్యాయస్థానం నిర్ధారించి ఆమెను విజయవాడ తీసుకువెళ్లేందుకు అనుమతినిస్తూ పీటీ వారంట్ జారీచేసింది.
⇒ అనంతరం.. కాదంబరి జత్వానీని విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమె అరెస్టు సక్రమమేనని విజయవాడ న్యాయస్థానం సైతం నిర్ధారించి.. ఆమెపై పోలీసులు నమోదు చేసిన అభియోగాలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలతో సంతృప్తి చెందింది. అందుకే ఆమెకు రిమాండ్ విధించింది.
..ఇలా కాదంబరి జత్వానీ అరెస్టు ప్రక్రియలో అప్పటి విజయవాడ పోలీసులు ఇంతగా నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే.. అసలు ఆమె అరెస్టు అక్రమమని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుండటం విడ్డూరంగా ఉంది. కనీసం ఒక్క ఆధారం కూడా చూపించకుండానే అక్రమ అరెస్టని ఏకపక్షంగా ప్రకటించడం ప్రభుత్వ కక్షసాధింపు చర్య తప్పా మరొకటి కాదని పోలీసు వర్గాలు విమర్శిస్తున్నాయి.
కాదంబరి అక్రమాలకు స్పష్టమైన ఆధారాలు..
వాస్తవానికి.. వలపు వల (హనీట్రాప్) వేసి బడాబాబులను బురిడీ కొట్టించడంతోపాటు కాదంబరి జత్వానిపై అనేక తీవ్రమైన అభియోగాలున్నాయి. తనపై యూపీలో కూడా పలు కేసులు ఉన్నాయని కాదంబరి జత్వానీనే తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఇక ఆమె కుక్కల విద్యాసాగర్ సంతకాలు ఫోర్జరీ చేసి ఆయన భూమిని అక్రమంగా విక్రయించేందుకు యత్నించారనడానికి కూడా ఆధారాలున్నాయి.
డాక్టర్ కాకుండానే తనను తాను డాక్టరుగా ఆమె చెప్పుకున్నారు. బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం విధించిన షరతులకు లోబడే తాను ఇబ్రహీంపట్నంలో రెండు నెలలపాటు ఉన్నానని ఆమె తన పిటిషన్‌లోనే అంగీకరించారు. ఆ సమయంలో తమకు సహాయం కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారని కూడా తెలిపారు. అంటే.. అప్పటి విజయవాడ పోలీసులు నిబంధన మేరకే వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.
ప్రభుత్వ పెద్దల కుట్రలో పాత్రధారులుగా విజయవాడ పోలీసులు..
అంతటి నేర చరిత్ర ఉన్న కాదంబరి జత్వానీ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పోలీసులకు విశిష్ట అతిథిగా మారిపోయారు. ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసే కుట్ర అమలులో భాగంగా ఆమెకు ప్రభుత్వ అతిథి స్థాయిలో విజయవాడ పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు.
నిజానికి.. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న మహిళలు, బాలికల అత్యాచారాలపై కూడా ఏమాత్రం స్పందించని పోలీసులు కాదంబరి విషయంలో అత్యుత్సాహంతో వ్యవహరించారు. గతంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా తప్పుల తడకగా ఉందని నెలక్రితం పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెతో తాజాగా మరో ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. రెండోసారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
తనను అరెస్టు చేసేందుకు డీసీపీ విశాల్ గున్నీని ప్రత్యేక విమానంలో ముంబై పంపించారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, విశాల్ గున్నీ తదితరులు సాధారణ విమానంలోనే ముంబై వెళ్లారని.. విమాన టికెట్లు ముందురోజే బుక్ చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అంటే.. ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపు కుట్రలో విజయవాడ పోలీసులు పాత్రధారులు, భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారన్నది సుస్పష్టం. ‘వలపు వల’ కేసుకు సంబంధించి నిందితురాలి విషయంలో పోలీసు వ్యవస్థ స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం దిగజారుస్తోందని పరిశీలకులు విమర్శిస్తున్నారు.
క్యాట్‌ను ఆశ్రయించనున్న ముగ్గురు అధికారులు..
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా తమను సస్పెండ్ చేయడంపై పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించాలని పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment