విశాఖ: సింహాచలం పూల తోటలో శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన జలధారలకు హారతులిచ్చారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. సింహగిరిపై ఎనిమిదేళ్లుగా జలధారలు శిథిలమయ్యాయని, ఇనేళ్ల తరువాత జలహారతి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. సింహగిరిపై మొక్కలు నాటడం శుభపరిణామమని స్వామి పేర్కొన్నారు.
అప్పన్న జలధారల పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ చూపలేదని, సింహాచలం ట్రస్ట్‌బోర్డు ప్రత్యేక చొరవతో జలహారతి కార్యక్రమం పునఃప్రారంభానికి నోచుకుందని స్వామి పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు చొరువను అడ్డుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని స్వామి ఆరోపించారు. అనతికాలంలోనే జలధారలను పునరుద్ధరించిన ట్రస్ట్ బోర్డును స్వామి ప్రశంసలతో ముంచెత్తారు. జలధారల పునరుద్ధరన విషయంలో సింహాచలం ట్రస్ట్ బోర్డు మిగతా దేవాలయాల ట్రస్ట్ బోర్డులకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై స్వరూపానందేంద్ర స్వామి స్పందిస్తూ.. స్వార్ధ ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు దేవుడితో చలగాటం ఆడటం ఏమాత్రం మంచిది కాదని, దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేవాలయాలపై దాడుల నియంత్రణపై ప్రభుత్వ చిత్తశుద్దిని స్వామి ప్రశంశించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ త్వరగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment