
కాణిపాకం (యాదమరి)/సింహాచలం(పెందుర్తి): చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి, విశాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానాలకు ఐఎస్‌వో సంస్థ సర్టిఫికెట్లను అందజేసింది. శుక్రవారం వినాయక చవితి రోజు ఐఎస్‌వో సంస్థ ప్రతినిధి శివయ్య కాణిపాకం ఆలయానికి చేరుకుని సంస్థ నుంచి ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు ఒకటి, క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌కు మరో సర్టిఫికెట్ అందజేశారు. ఆయనకు ఆలయ ఈవో వెంకటేశు స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఐఎస్‌వో సంస్థ ప్రతినిధి సర్టిఫికెట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి చేతుల మీదుగా ఆలయానికి అందించారు.
కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, తదితరులు ఉన్నారు. మరోవైపు అప్పన్న దేవస్థానానికి ఐఎస్‌వో 9001–2015 గుర్తింపు లభించింది. సింహగిరికి వచ్చే భక్తులకు నాణ్యమైన సేవలు, హిందూ ధర్మం, సంస్కృతిని ప్రచారం చేస్తున్నందుకు దేవస్థానానికి ఈ గుర్తింపు లభించింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సింహాచలం దేవస్థానానికి ఈ గుర్తింపునిచ్చింది. ఆ సంస్థ జారీ చేసిన ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రాన్ని శనివారం రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతులమీదుగా దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ అందుకున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా దేవస్థానం అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే పంచగ్రామాల భూసమస్య పరిష్కారమవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment