వివరాలు వెల్లడిస్తున్న డ్రైవర్ మధు
శ్రీకాళహస్తి: తన పంటను తానే ధ్వంసం చేసుకుని వైఎస్సార్‌సీపీ వారిపైకి నెట్టిన టీడీపీ కార్యకర్త బాగోతం బట్టబయలైంది. పోలీసుల విచారణలో తెలుగుదేశం నేతల కుట్ర బయటపడింది. లోకేశ్ పాదయాత్ర తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం మీదుగా సాగనుండడంతో దానికి ప్రచారం తీసుకురావాలని టీడీపీ నేతలు కుట్రకు తెరతీశారు. అందుకు పార్టీ కార్యకర్త మురళీకృష్ణారెడ్డిని పావుగా చేసుకున్నారు.
మండలంలోని చిట్టత్తూరు గ్రామానికి చెందిన మురళీకృష్ణారెడ్డి 4.25 ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ సాగుచేశాడు. ‘నీ పంటను నువ్వే ధ్వంసం చేసి దాన్ని వైఎస్సార్‌సీపీ వారు చేశారని ప్రచారం చెయ్యి. పాదయాత్రలో లోకేశ్‌ను మీ ఇంటికి తీసుకొస్తాం. నీకు నష్టపరిహారం ఇప్పించి, మంచి లీడర్‌ని చేస్తాం..’ అంటూ మురళీకృష్ణారెడ్డికి చెప్పారు. దీంతో మురళీకృష్ణారెడ్డి, డ్రైవర్ మధు ఈనెల 9న (గురువారం) రాత్రి రోటావేటర్‌తో వేరుశనగ పంటను ధ్వంసం చేశారు.
శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి తన పంటను వైఎస్సార్‌సీపీ నాయకులు నాశనం చేశారంటూ మురళీకృష్ణారెడ్డి గగ్గోలు పెట్టారు. పథకం ప్రకారం టీడీపీ నేతలంతా గ్రామంలో పర్యటించి వైఎస్సార్‌సీపీ నాయకులపైన, ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా, సీసీ ఫుటేజీలు పరిశీలించి మురళీకృష్ణారెడ్డిని, మధుని విచారించారు.
తన పంటను తానే ధ్వంసం చేసుకున్నట్లు మురళీకృష్ణారెడ్డి అంగీకరించారని సీఐ విక్రమ్ తెలిపారు. ఈ విషయంపై విలేకరులు డ్రైవర్ మధుని అడగగా.. పంట ధ్వంసం వెనుక రాజకీయాలు తనకు తెలియదని చెప్పాడు. పంట సరిగా రాలేదని, ధ్వంసం చేస్తే ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పడంతోనే రోటావేటర్‌తో దున్నేశానని స్పష్టం చేశాడు. దీంతో టీడీపీ కుట్ర బహిర్గతమైంది.
Comments
Please login to add a commentAdd a comment