టమాటా దిగుబడిని తరలించకుండా అడ్డుకున్న తమ్ముళ్లు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యాలు
వైఎస్సార్‌సీపీ వర్గీయులపై వివిధ రకాలుగా కొనసాగుతున్న వేధింపులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని కమ్మపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. పదిరోజుల నుంచి వైఎస్సార్‌సీపీ కుటుంబాలు గ్రామంలోంచి బయటకు వెళ్లకుండా, వెలుపల ఉన్నవారు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామంలో జరుగుతున్న ఆటవిక చర్యల గురించి సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. నాలుగు రోజుల కిందట టీడీపీ నేతల దాడుల్లో తీవ్రంగా గాయపడినవారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియని దుస్థితి నెలకొంది.
రెండురోజుల కిందట పోలీసులు గ్రామంలోకి వెళ్లి ఇరువర్గాల వారితో మాట్లాడినా.. టీడీపీ నేతల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. గ్రామంలో జరుగుతున్న దౌర్జన్యకాండ బయటకు పొక్కకుండా చూసేందుకు వారి ఫోన్లు కూడా లాగేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ గ్రామంలోకి పాల సరఫరా నిలిపివేశారు. వైఎస్సార్‌సీపీ వారి పశువులకు గ్రాసం కూడా వేయనీయడంలేదని తెలిసింది. గ్రామంలోని వైఎస్సార్‌సీపీ కుటుంబాలకు చెందిన టమాటా దిగుబడులను మార్కెట్‌కు తరలించకుండా నిలిపేశారు. పొలాల్లో నాలుగు రోజులుగా నిల్వ ఉన్న టమాటా దిగుబడికి సంబంధించినవీడియోలు బయటకు వచ్చాయి.
గ్రామంలో సుమారు వెయ్యి బాక్సుల వరకు టమాటా నిల్వలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక బాక్సు విలువ రూ.500కు పైనే. ఒకటి రెండురోజుల్లో మార్కెట్‌కు తరలించకపోతే ఈ టమాటా దిగుబడి మొత్తం కుళ్లిపోయే ప్రమాదం ఉంది. టీడీపీ దౌర్జన్యకాండను జీర్ణించుకోలేని ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఈవీడియోలు, ఫొటోలను వైరల్ చేసినట్లు తెలిసింది. మీడియా, పత్రికల వారికి పంపినట్లు సమాచారం. గ్రామంలో జరుగుతున్న టీడీపీ నేతల దాష్టీకంపై మానవహక్కుల కమిషన్ స్పందించాలని మానవతావాదులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment