సాక్షి, విశాఖపట్నం : నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు నిరూపితమైంది. ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళా నేతకు మధ్యలోనే వెన్నుపోటు పొడిచి.. వేరే వ్యక్తికి టికెట్ ఖరారు చేయడం జిల్లా టీడీపీ నాయకులను సైతం విస్మయానికి గురిచేసింది. టికెట్ కేటాయించిన మూడు నెలలకే అభ్యరి్థని మార్చేశారు. ఆదరాబాదరాగా తొలుత అభ్యర్థిని ప్రకటన చేసి.. డబ్బులు లేవన్న కారణంతో ఆమెకు మొండిచెయ్యి చూపించారు. మహిళలకు పార్టీలో గౌరవం లేదంటూ ఇటీవలే ఆ పార్టీలో ఉన్న మహిళా నేతలు బాహాటంగా చెప్పిన విషయాలు.. తాజా నిర్ణయంతో మరోసారి నిరూపితమైంది.
బీసీ మహిళకు షాక్ ఇచ్చి సామాజిక వర్గ ప్రాతిపదికపై ఎంపిక చేశారు. మార్చిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సందడి మొదలైంది. పార్టీ పూర్తిగా పట్టుకోల్పోతున్న నేపథ్యంలో ఎన్ని కుయుక్తులైనా పన్ని.. విజయం సాధించాలని చంద్రబాబు నానా యాతన పడుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘ మంతనాలు, సదస్సులు నిర్వహించిన టీడీపీ.. మూడు నెలల క్రితం మహిళా నేతకు ఖరారు చేసింది. వాస్తవానికి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌తో పాటు మరికొందరు కీలక నేతల్లో ఎవరైనా ఒకరికి టికెట్‌ని కేటాయించాలని భావించారు.
పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, ఈ తరుణంలో ఎన్నికల్లో నిలబడి.. డబ్బులు పోగొట్టుకోలేమంటూ దాదాపు అన్ని సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలంతా తెగేసి చెప్పారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులపై చంద్రబాబు, అచ్చెన్న, బుద్ధా వెంకన్న దృష్టిసారించారు. గతంలో భీమిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ.. ప్రస్తుతం జీవీఎంసీ 2వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న గాడు చిన్ని కుమారి లక్ష్మిని సంప్రదించారు. దాదాపు రూ.4 కోట్ల వరకూ ఖర్చు చేయగలమనీ.. మిగిలిన డబ్బులు పార్టీ సర్దాలని కోరడంతో టికెట్ ఖరారు చేస్తున్నట్లు బాహాటంగా ప్రకటించారు.
డబ్బులు లేవంటూ పక్కన పెట్టేశారు
ఇప్పటికే పార్టీ ఎన్నికల ఖర్చులంటూ రూ.లక్షల వరకూ సదరు అభ్యర్థి ద్వారా ఖర్చు చేయించారు. ఇటీవల టీడీపీ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత మొత్తం సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పార్టీ వైఖరిపై విసుగు చెందిన సదరు మహిళా అభ్యర్థి కుటుంబం.. టీడీపీ నేతల ఫోన్లు ఎత్తడం మానేశారు. డబ్బులు సర్దుబాటు చేయలేమని అధిష్టానానికి సమాచారం పంపించారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కోట్లయినా పెట్టగలిగిన అభ్యరి్థని చూడాలని చెబితే.. ఇలాంటి వారిని ఎందుకు ఎంపిక చేశారంటూ పార్టీ ఎన్నికల పరిశీలకులపై మండిపడ్డారు. కోట్లు ఖర్చు చేసైనా ఎమ్మెల్సీ గెలవాల్సిందేననీ, అలాంటి వారికి టికెట్ కేటాయించాలని ఆదేశించారు. దీంతో మరోసారి మదింపు నిర్వహించి రావికమతం ప్రాంతానికి చెందిన డా.వేపాడ చిరంజీవరావును ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి అంటూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. డబ్బులు లేకపోవడం వల్లనే ఆమెను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రచారంలో దూసుకుపోతున్న సీతంరాజు
ఈసారి రాజకీయపక్షాలు ముందుగానే ఎన్నికలపై దృష్టిసారించాయి. వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరిచిన అభ్యరి్థగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేరును ప్రకటించింది. ఆయన ప్రతి నియోజకవర్గంలోనూ అన్ని వర్గాల ప్రతినిధులతో భేటీ అవుతూ ప్రచారం పర్వం కొనసాగిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ మాధవ్ కొనసాగుతున్నారు. పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యరి్థగా డా.కోరెడ్ల రమాప్రభ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు.
బీసీ మహిళకు షాకిచ్చిన బాబు
టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో గాడు కుటుంబం షాక్‌కు గురైంది. కనీసం ఒక మాట చెప్పకుండా.. టికెట్‌ని వేరేవాళ్లకు కేటాయించడాన్ని అవమానకరంగా భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. టీడీపీలో మహిళలకు గౌరవం లేదన్నది మరోసారి సుస్పష్టమైందని పార్టీలోని కొందరు నేతలు విమర్శిస్తుండటం గమనార్హం. ఇప్పటికే రూ.కోటిన్నర వరకూ ఖర్చు చేయించి.. ఇప్పుడిలా మోసం చేశారంటూ గాడు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ మహిళని పార్టీ అవమానించిందంటూ జిల్లా టీడీపీ నాయకులే చెబుతున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అచ్చెన్నాయుడికి తప్ప ఉత్తరాంధ్రలోని ఏ ఒక్క టీడీపీ నేతకు కూడా తెలియకపోవడం విశేషం. బీసీ వర్గాలకు వెన్నుపోటు పొడిచి.. ఉన్నత వర్గాలకు టికెట్ కేటాయించడం వెనుక చోడవరం టీడీపీ సీనియర్ నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment