ఫేక్‌ ప్రచారంలో టీడీపీ ‘స్కిల్‌’ | Tdp Fake campaign as per scheme | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ప్రచారంలో టీడీపీ ‘స్కిల్‌’

Published Sun, Sep 17 2023 3:55 AM | Last Updated on Sun, Sep 17 2023 11:15 AM

Tdp Fake campaign as per scheme - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున అబద్ధపు ప్రచారానికి తెరలేపింది. ఆయన అవినీతి స్పష్టంగా కనబడుతుండడంతో ప్రజల్లో ఏమాత్రం మద్దతు లభించడంలేదు. దీంతో ఎల్లో మీడియా, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్‌ మీడియాతోపాటు టీడీపీ శ్రేణులు, రంగంలోకి దిగి చంద్రబాబు సత్యహరిశ్చంద్రుడంటూ ప్రజలను ఏమార్చేందుకు శతవిధాలుగా ప్రయ­త్నిస్తున్నారు.

ఒకవైపు చంద్రబాబు చేసిన అవినీతిపై సీఐడీ స్పష్టమైన ఆధారాలు చూపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా.. ఆధారాల్లేవని, చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని, దార్శనికుడికి ఇలాంటి పరిస్థితి కల్పించారంటూ సానుభూతి వచ్చేలా బుకాయిస్తూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఆ పార్టీకి మొదటి నుంచి అలవాటైన పెయిడ్‌ ప్రమో­షన్‌కు తెరలేపారు.

ఇందులో భాగంగా రెండ్రో­జు­లుగా ప్రజలకు అదేపనిగా ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌­కాల్స్‌ వస్తున్నాయి. ‘మచ్చలేని రాజకీయాలకు మారు­పేరైన చంద్రబాబునాయుడు వంటి నిజాయితీ గల నాయకుడిని చేయని తప్పుకు జైల్లో పెట్టారు. ఆయ­నకు అందరూ అండగా నిలవాలి’.. అంటూ 50 సెకన్ల ఫోన్‌కాల్‌ రాష్ట్రంలోని అన్ని మొబైల్‌ యూ­జర్లకు వెళ్లేలా భారీ పెయిడ్‌ ప్రమోషన్‌ చేపట్టారు. 

ఐటీ ప్రొఫెషనల్స్‌ పేరుతో హడావుడి
ఎల్లో మీడియా అయితే అడ్డూఅదుపు లేకుండా చంద్ర­బాబును సమర్థించే పనిలో మునిగిపోయింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు గురించి రకరకాల వ్యక్తులతో మాట్లాడిస్తూ అది నిజంగా అమలు జరిగినట్లు భ్రమ కల్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలోని జనం నుంచి స్పందన లేకపోవడంతో ఐటీ ఉద్యోగులను ఉప­యో­గిం­చుకుంటున్నారు. టీడీపీ ఐటీ, ఎన్‌ఆర్‌ఐ విభా­గాలు ప్లాన్‌చేసి హైదరాబాద్‌లో కొందరు ఐటీ ఉద్యోగులను సమీకరించి ఆందోళనలు చేయించారు. కానీ, ఇందులో ఐటీ ఉద్యోగుల కంటే బయటి వ్యక్తులే భారీగా ఉన్నట్లు తేలింది. వారిలో చాలా­మందికి స్విగ్గీ కూపన్లు ఇచ్చి తీసుకొచ్చినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.

బెంగళూరులోనూ ఇదే తరహాలో కొందరు ఐటీ ఉద్యోగులతో ఆందోళన చేయించారు. నిజానికి.. చంద్రబాబు అరెస్ట­యితే టీడీపీ శ్రేణులు, నాయకులే పెద్దగా బయటకు రాలేదు. దయచేసి బయటకు రావాలని అచ్చెన్నా­యుడు, యనమల వంటి నేతలు పార్టీ శ్రేణుల్ని టెలీ­­కాన్ఫ­రెన్స్‌లో బతిమాలు­కున్నా ప్రయోజనం లేకుం­డాపోయింది. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ ఉద్యో­గు­లతో టీడీపీ ముఖ్య నేతలు ఆందోళనలు చేయిస్తున్నట్లు తేలింది. దీనికి వారు తెరవెనుక వ్యూహ రచనచేసి అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. 

పథకం ప్రకారం ఫేక్‌ ప్రచారం..
ఇక టీడీపీ ప్రొఫెషనల్స్‌ విభాగానికి చెందిన తేజశ్విని అనే యువతి చంద్రబాబుకు మద్ద­తుగా విడుదల చేసిన ఒక వీడియోను వైరల్‌ చేశారు. అమరావతి ఉద్యమంలో ఆమె చురు­గ్గా పాల్గొంది. చంద్రబాబు సీఎంగా ఉన్న­ప్పుడు పలు కార్యక్రమాల్లోనూ పాలుపంచు­కుంది. టీడీపీకి సంబంధించి ముఖ్యమైన ప్రతి కార్యక్రమంలో ఆమె పాల్గొంటుంది. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా ఆమెను ఐటీ ప్రొఫెషనల్‌గా రంగంలోకి దింపి వీడియోలు చేయించి వైరల్‌ చేస్తున్నారు.

ఇలాంటి మరి­కొందరిని టీడీపీ ఒక వ్యూహం ప్రకారం పని­చేయిస్తూ చంద్రబాబు నిజాయితీ­పరుడని కలర్‌ ఇచ్చేందుకు యత్నిస్తున్నారు. ‘స్కిల్‌ డెవ­ల­ ప్‌­మెంట్‌’ను సమర్థించుకుంటూ శుక్రవారం ఆ పార్టీ ఏకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించడం విశేషం. వీటన్నింటినీ చూపిస్తూ ‘వీ స్టాండ్‌ విత్‌ చంద్రబాబు’.. పేరుతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. కానీ, సాధా­రణ ప్రజానీకంలో మాత్రం చంద్రబాబు అరె­స్టు వ్యవహారంపై పెద్దగా స్పందన కనిపించడంలేదు. వారి నుంచి ఎలాగైనా సానుభూతి పొందడానికి ఆ పార్టీ అన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలకు దిగింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement