అర్ధరాత్రి కత్తులు, రాడ్లతో స్వైర విహారం
ఇంట్లోకి దూరి ఫర్నీచర్, టీవీలు, కిటికీలు ధ్వంసం
గర్భిణి అని కూడా చూడకుండా కోడలిపై దాడి
దాడికి కొన్ని గంటల ముందు జెడ్పీటీసీ భర్త రెడ్డయ్యకు మంత్రి బెదిరింపులు
లక్కిరెడ్డిపల్లె: వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అంబాబత్తిన రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డయ్య దంపతుల ఇంటిపై టీడీపీ మూకలు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం పరిధిలోని జాండ్రపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. దాడి జరగక ముందే మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. లక్కిరెడ్డిపల్లె టీడీపీ నేత మదన్‌మోహన్ సెల్ ద్వారా వాట్సాప్ కాల్ చేసి ‘నిన్ను చంపేస్తాం’ అని బెదిరించాడని మాజీ ఎంపీపీ రెడ్డయ్య ఆరోపించారు. రెండు సుమోలు, మరో మూడు వాహనాలలో 60 మందికి పైగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు మంకీ క్యాపులు పెట్టుకుని మచ్చు కత్తులు, ఇనుప రాడ్లతో తమ ఇంటిపై దాడికి తెగబడ్డారని రమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.
తన భర్త రెడ్డయ్య, కుమారుడు రమేష్‌ను కాపాడుకునేందుకు ఇంటి వెనక డోర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తుండగా, ఆడవాళ్లు అని కూడా చూడకుండా తమపై దాడి చేశారని వాపోయారు. తమ కోడలు ఆరు నెలల గర్భిణి అని, ఆమె జోలికి వెళ్లొద్దని ప్రాథేయపడినా వినకుండా దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. తమ ఇంటి బయట ఉన్న బుల్లెట్ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారని, మరో బుల్లెట్ వాహనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. అంతలో గ్రామస్తులు అక్కడికి చేరుకుని దాడిని అడ్డుకోబోగా, జగన్మోహన్ ప్రసాద్ అనే వ్యక్తిపై ఇనుప రాడ్డుతో దాడి చేసి గాయపరిచారన్నారు.
ఇంట్లోకి దూరి తలుపులు, కిటికీల అద్దాలు, సామాన్లు, ఫర్నీచర్, టీవీలు, సోఫా సెట్లను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు బయట నిద్రిస్తున్న రెడ్డయ్య తల్లి లేవలేని స్థితిలో మంచానపడి ఉన్నా కూడా కనికరించలేదని, ఆమెపై కూడా దాడి చేశారన్నారు. 40 ఏళ్ల రాజకీయంలో తాము ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి, ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డిలు రమాదేవికి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment