డీ.హీరేహాళ్ మండలంలోని కూడ్లూరు గ్రామ సర్వే నంబర్ 201లో 3.59 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఓ పోలీసు అధికారి.. పక్కనే ఉన్న మరో 20 సెంట్ల ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నాడు. తన మామ, టీడీపీ నాయకుడి అండతో బినామీ హరిజన హనుమంతప్ప పేరిట 3.79 ఎకరాలకు పట్టా చేయించుకున్నాడు. ఈ భూమిలో ఇసుక లేకపోయినా రీచ్‌కు అనుమతి పొంది.. పక్కనే ఉన్న దళితుల శ్మశానం, వంక పరంబోకులో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. సదరు పోలీసు అధికారి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ దందా వెనుక ఉన్నారనే విషయం బహిరంగ రహస్యం.
సాక్షి, రాయదుర్గం: సహజ వనరులను దోచుకోవడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాల్లో రూ.కోట్లు సంపాదించిన నేతలు.. ఇప్పుడూ అదేబాటలో వెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు దళితులను అడ్డుపెట్టుకుని ఇసుక దందా సాగిస్తున్నారు. అక్రమం బయటపడితే తమ చేతికి మట్టి అంటుకోకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామంలో ఇసుక రీచ్‌కు అనుమతి పొంది సమీప ప్రాంతాల్లోని వంక పరంబోకును తోడేస్తున్నారు. ఈ దందా బయటపడటంతో టీడీపీ నేతలు దళిత రైతును ముందు పెట్టి నాటకం ఆడించడం విమర్శలకు తావిస్తోంది. (మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి బిగుస్తున్న ఉచ్చు!)
ఖాకీ అల్లుడు.. బినామీల పర్వం
రాయదుర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమార్తెను వివాహం చేసుకున్న ఓ పోలీసు అధికారి తన మామ పలుకుబడి ఉపయోగించి డీ.హీరేహాళ్‌లో పోస్టింగ్ వేయించుకున్నాడు. దాదాపు రెండున్నరేళ్లు ఇక్కడే పనిచేశాడు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా.. తన సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి ఆశీస్సులు పొంది భారీగా సంపాదించాడు. అనతి కాలంలోనే సుమారు 80 ఎకరాలకుపైగా భూములు కొనుగోలు చేసి బినామీల పేరిట పట్టాలు చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మాజీ మంత్రి అండతో తన భూముల పక్కనే ఉన్న అసైన్డ్ భూములను కూడా కలిపేసుకుని పట్టాలు పొందాడు. ఇలా డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 201లో 3.59 ఎకరాల భూమిని ఇతరుల ద్వారా కొనుగోలు చేసి ఆ పక్కనే ఉన్న మరో 20 సెంట్ల అసైన్డ్ భూమిని ఆక్రమించి మొత్తంగా 3.79 ఎకరాలకు తన మామ నమ్మిన బంటుగా ఉన్న హరిజన హనుమంతప్ప పేరిట పట్టా చేయించాడు.
ఇసుక లేకపోయినా రీచ్‌కు అనుమతి
తన బినామీ హరిజన హనుమంతప్ప పేరిట చేయించిన భూమిలో ఇసుక లేకపోయినప్పటికీ సదరు పోలీసు అధికారి, ఆయన మామ రీచ్ కోసం మంత్రాంగం నడిపించారు. కొందరు అధికారుల అండతో ఇసుక రీచ్‌కు అనుమతులు పొందారు. టన్ను ఇసుకకు రూ.60 చెల్లించేలా తొలుత అధికారులతో ఒప్పందం చేసుకుని ఆ తర్వాత నష్టం వస్తుందని సాకుగా చూపి టన్ను ఇసుకకు రూ.100 ఇచ్చేలా అనుమతి పొందారు. అలాగే ఇసుక రవాణా కాంట్రాక్టర్‌ను సైతం తమ వారినే నియమించుకుని ఇసుక దందా ప్రారంభించారు. (తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు)
శ్మశానంలో తవ్వకాలు..
పట్టాభూమిలో ఇసుక లేకపోవడంతో పక్కనే ఉన్న దళితుల శ్మశానం, ఆ పక్కనే ఉన్న చిన్న హగరిలోని పరీవాహకంలోని 14 ఎకరాల్లో ఇసుకను ఇష్టానుసారం తవ్వేసి విక్రయించుకున్నారు. ఈ క్రమంలో 4 అస్థిపంజరాలు బయట పడినా గుట్టుగా వేరే ప్రాంతంలో పూడ్చినట్లు గ్రామానికి చెందిన దళితులు చెబుతున్నారు. ఇసుక రవాణా కాంట్రాక్టర్ కూడా తమవాడే కావడంతో ఇసుక అక్రమ దందాను నిరాటంకంగా కొనసాగించారు.
అక్రమం బయట పడటంతో కాలవ ఎదురుదాడి
డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు ఇసుక రీచ్ అక్రమాలు బయటపడటంతో కాలవ బయటకొచ్చారు. ఈ దందా వెనుక ఉన్న తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని ప్రభుత్వంపై, స్థానిక ప్రజాప్రతినిధిపై ఎదురుదాడికి దిగారు. తన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, అతని అల్లుడు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే విప్ కాపు రామచంద్రారెడ్డి దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంతో అధికారులు ఇప్పుడు తీగలాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment