కుప్పంలోని కమతమూరు రోడ్డులో నారా లోకేష్ బహిరంగ సభ ప్రాంగణం
కుప్పం(చిత్తూరు జిల్లా): టీడీపీ నేత నారా లోకేశ్ కుప్పం నుంచి శుక్రవారం ప్రారంభిస్తున్న యువగళం పాదయాత్రకు రూ.10కోట్ల భారీ వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు కేవలం సభా ప్రాంగణంలో వేదిక, కటౌట్లు, హోర్డింగులకు రూ.5 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు. జన సమీకరణ కోసం మరో రూ.5 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. కుప్పంలోని కమతమూరు రోడ్డులో టీడీపీ నేతలకు చెందిన 10 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభకు వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
పాదయాత్రకు కుప్పం నియోజకవర్గంలో ఒక్కో పంచాయతీ నుంచి 300 మందిని తరలించాలని టీడీపీ క్యాడర్‌కు అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ జన సమీకరణపై క్యాడర్‌తో నేరుగా మాట్లాడుతున్నారు. బహిరంగ సభకు వచ్చిన వారికి నగదు, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేలా టీడీపీ చర్యలు చేపట్టింది.
తొలిరోజు పాదయాత్ర ఇలా..
నారా లోకేశ్ గురువారం రాత్రి కుప్పం చేరుకుని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలోని వరదరాజులు దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. కమతమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం గుడుపల్లె మండలం శెట్టిపల్లి చేరుకుంటారు. రాత్రి పీఈఎస్ మెడికల్ కళాశాల ఎదుట ఓ ప్రైవేట్ స్థలంలో లోకేశ్ బస చేస్తారు. రెండో రోజు అక్కడి నుంచి శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తారు.
‘ఈనాడు’ తప్పుడు కథనాలు : ఎస్పీ
చిత్తూరు అర్బన్: నారా లోకేశ్ పాదయాత్రపై ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్రకు సాధారణ షరతులతో అనుమతి ఇచ్చామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment