టీడీపీ నేత నుంచి స్థలాన్ని కాపాడాలని కోరుతున్న మహిళలు
ఇచ్ఛాపురం రూరల్: ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్నుపడింది. దానిని చదును చేసి.. ప్లాట్లుగా విభజించి విక్రయించాలన్న దురాలోచనతో పొక్లెయిన్‌తో రంగంగలోకి దిగాడు. అడ్డొచ్చిన వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. దీంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తులసిగాం పంచాయతీ పరిధిలోని ఇన్నేశుపేట పొలిమేరలో 20 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో పాతికేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శీర పురుషోత్తం చెట్లు నాటి గ్రామస్తుల సహకారంతో ఆధ్యాత్మిక స్థలంగా అభివృద్ధి చేశాడు.
ఆయనను స్థానికులు పూజారిగా పిలుచుకుంటారు. దీనికి పక్కనే ప్రభుత్వం విశ్రాంతి భవనం నిర్మించింది. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణంలో ఉంది. ఆ స్థలం పక్కనే బలరాంపురం గ్రామానికి చెందిన లండ సూర్యనారాయణ (బగ్గేడు)కు స్థలం ఉంది. దీన్ని టీడీపీ నేత దుక్క వెంకటేష్ ఇటీవల ప్లాట్లుగా విభజించి విక్రయించే నిమిత్తం కొనుగోలు చేశాడు. రోడ్డు పక్కనే విలువైన ఆధ్యాత్మిక స్థలం ఉండటంతో దాన్ని ఆక్రమించేందుకు ఇటీవల పొక్లెయిన్‌తో చెట్లు పడగొట్టాడు. అడ్డుకోవడానికి వెళ్లిన పురుషోత్తంపై దౌర్జన్యం చేసి కొట్టాడు. దీంతో గ్రామపెద్దలు, మహిళలు టీడీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది కూడా దుక్క వెంకటేష్‌కు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేశా
గ్రామస్తుల సహకారంతో స్థలాన్ని అభివృద్ధి చేశాను. కార్తీక మాసంలో మహిళలు ఇక్కడ వన భోజనాలు చేస్తుంటారు. రోడ్డు పక్కన ఉండటంతో ఈ స్థలాన్ని వెంకటేష్ ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. చెట్లను ధ్వంసం చేశారు. అడ్డుకుంటే నాపై దాడి చేశారు.
– శీర పురుషోత్తం, ఇన్నేశుపేట
Comments
Please login to add a commentAdd a comment