పలమనేరు (చిత్తూరు): ఒక్కగానొక్క కుమార్తె కావడంతో భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు ఆ తల్లిదండ్రులు. అయితే ఏడాది తిరగకుండానే ఎనిమిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా భర్త, అత్తమామలు కలసి రూ.30 లక్షల అదనపు కట్నం కోసం వేధించి బాధిత కుటుంబీకులపై దాడి చేసిన సంఘటన బుధవారం పలమనేరులో వెలుగుచూసింది.
వివరాలిలా.. పలమనేరు పట్టణంలోని జిలానీ క్రాస్‌కు చెందిన మహ్మద్ అజాం కుమార్తె మిస్బాల్ అల్‌ఖైర్‌కు పట్టణంలోని మసీదువీధికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చెర్మన్ చాంద్‌బాషా కుమారుడు యూసఫ్ ఖాదీర్‌తో 11 నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు కట్నం కింద కిలో బంగారు, 750 గ్రాములు వెండి, కియా కారు, బుల్లెట్ బండి, 50 జతల దుస్తులు, 50 వాచ్‌లు, లక్షలాది రూపాయలు విలువజేసే వస్తువులను అబ్బాయికి కానుకగా ఇచ్చారు.
రెండునెలల పాటు సజావుగా సాగిన వీరి కాపురం, ఆపై రూ.30 లక్షల అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. మత్తుకు బానిసైన భర్తతో వేధింపులు తాళలేక విషయాన్ని బాధితురాలు తన తల్లి, అన్న, పెద్దనాన్నలకు తెలిపింది. వారు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసి కాపురాన్ని సరిదిద్దారు. అయితే మళ్లీ బాధితురాలికి వేధింపులు తప్పలేదు. బాధితురాలు ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి కావడంతో అబార్షన్ చేసుకోవాలని అత్తారింటి బెదిరింపులు మొదలయ్యాయి. దీనిపై ఈ నెల 28న బాధితురాలి కుటుంబీకులపై దాడి జరిగింది. ఫలితంగా తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు మిస్భాల్ అల్‌ఖైర్ ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment