వివాదంలో సర్దిచెప్పారని ఆగ్రహం
నీ అంతు చూస్తామని బెదిరింపు
అధికార టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికారం అండ చూసుకుని టీడీపీ నేతల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. ప్రతిపక్ష నేతలు, ప్రజలపై దాడులు చేయడమే కాకుండా ఇంకో అడుగు ముందుకేసి పోలీసులపై కూడా దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారు. నీ అంతు చూస్తామంటూ.. నడివీధిలో ఏకంగా ఒక ఎస్సైని చొక్కా పట్టుకుని లాగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో పోలీస్ అధికారి యూనిఫాం బటన్స్ తెగిపోవడంతోపాటు చొక్కా చిరిగిపోయింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు బతుకమ్మ ఊరేగింపు చేస్తున్నారు. కొంత సేపటి తర్వాత ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే వద్ద వివాదం తలెత్తింది. బందోబస్తులో ఉన్న ఎస్సై రాజా జోక్యం చేసుకుంటూ సర్ది చెప్పారు. గొడవ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అయినా వినిపించుకోక పోవడంతో గొడవకు కారణమని భావించిన ఒక యువకుడి వీపుపై తడుతూ వెళ్లిపొమ్మని చెప్పారు.
దీంతో ఆగ్రహించిన ఆ యువకుడి బంధువులు, టీడీపీ నాయకులు ‘మావాడిపై చేయి చేసుకుంటావా.. కొట్టడానికి నువ్వు ఎవరు.. నీ సంగతి చూస్తాం..’ అంటూ మూకుమ్మడిగా ఎస్సైపైకి దూసుకువెళ్లారు. చొక్కా పట్టుకుని గట్టిగా లాగేశారు. దీంతో బటన్స్ ఊడిపోయి, చొక్కా చిరిగిపోయింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తన పైకి దాడికి రావడంతో దిక్కుతోచని ఎస్సై వెనక్కు తగ్గాడు. గొడవ పడొద్దని చెప్పడమే పాపమైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పెదకూరపాడు సీఐ సురేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అటువంటి ఘటన ఏమీ జరగలేదని, ఎటువంటి వివాదం లేకుండా ఊరేగింపు జరిగిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment