చీపురుపల్లి: తారు రోడ్లు బాగోలేవంటూ టీడీపీ నాయకులు లేనిపోని ఆర్భాటం చేస్తారు. వారు చేసిన హడావుడికి తగ్గట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అదే తెలుగుదేశం నాయకులు సమావేశాల పేరిట ఏర్పాటు చేసే ఫ్లెక్సీల కోసం ఎంతో పటిష్టంగా ఉన్న బీటీ రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. చీపురుపల్లి పట్టణంలో ఆదివారం ఇదే సంఘటన జరిగింది.
గరివిడి మండలంలోని కుమరాం పంచాయతీ సర్పంచ్ ముల్లు రమాదేవి టీడీపీలో చేరుతున్న సందర్భంగా పట్టణంలోని తారురోడ్లు తవ్వేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చక్కగా ఉన్న రోడ్లను తవ్వేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చీపురుపల్లిలోని మూడు రోడ్ల జంక్షన్, గెడ్డమిల్లు, ఆంజనేయపురం, అగ్రహారం, గరివిడి, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటి కోసం నాలుగైదు నెలల కిందట కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బీటీ రోడ్లను గోతులుగా మార్చేశారు.
టీడీపీ మద్దతుతో గెలిచి....
గరివిడి మండలంలోని కుమరాం పంచాయతీ సర్పంచ్ ముల్లు రమాదేవి గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలుపొందారు. ఆ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు పోటీ చేయకుండా ముల్లు రమాదేవికి పార్టీ తరఫున పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. దీంతో ఆమె గెలుపొందారు. ఇదంతా జరిగి చాలా కాలం గడిచిపోయింది. అయితే రమాదేవి ప్రస్తుతం టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ మద్దతుతో గెలిచి మళ్లీ అదే పార్టీలో చేరడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment