చిన్నకుర్లపల్లె వద్ద చంద్రబాబు పీఏ మనోహర్ నిర్మించుకున్న అధునాతన భవంతి
సొంతూరు చంద్రగిరి ఓడగొట్టినా.. తనను ఆదరించిన కుప్పం పట్ల కూడా కనీస కృతజ్ఞత చూపించని చంద్రబాబు అప్పనంగా ఆ నియోజకవర్గాన్ని అక్కడి టీడీపీ నేతలకు అప్పగించేశారు.
♦అంతే తడవుగా.. తెలుగుదేశం నేతలు కుప్పంను పూర్తిగా ఊడ్చేశారు.
♦చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం పాత సామెత.. బాబు పేరు చెప్పుకుని భూములు దోచేయడం.. అడ్డగోలుగా కాంట్రాక్టులు కొట్టేయడం.. అందిన కాడికి వసూళ్లు చేయడం... కుప్పం టీడీపీ నేతలు కొత్త రివాజుగా మొదలుపెట్టారు.
♦ముప్పై ఏళ్లుగా బాబు హయాంలో కుప్పంలో జరిగిన అభివృద్ధి ఏంటని అడిగితే టీడీపీ నేతల్లో ఎవ్వరూ సరిగా సమాధానం చెప్పలేని దుస్థితి.
♦కానీ అదే ముప్పై ఏళ్లలో టీడీపీ నేతల అభివృద్ధి చూస్తే.. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది.
♦సరిగ్గా తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి రూ.కోట్లకు ఎగబాగిన కుప్పంలోని బాబు తాబేదార్ల గురించి ఇక్కడి ప్రజలందరికీ తెలుసు.
♦పీఏ మనోహర్ మొదలు ఏడుగురు టీడీపీ నేతల అవినీతి ప్రస్థానం నిన్న ఒకింత పరికించే ప్రయత్నం చేశాం.. ఇవాళ మిగిలిన నేతల చిట్టా చూద్దాం రండి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అప్పుడప్పుడు.. నిజం చెప్పాలంటే ఎక్కడా, ఏ పనీ లేనప్పుడు.. వీలున్నప్పుడు.. చంద్రబాబునాయుడు కుప్పం వచ్చి వెళ్తుంటారు. మనస్ఫూర్తిగా కాకుండా మొహమాటపు పర్యటనలకే శ్రీకారం చుడుతుంటారు. వచ్చినప్పుడు మాత్రం కాస్త సెంటిమెంట్ డైలాగులే వల్లిస్తుంటారు. కుప్పం అంటే నాకు చాలా అది.. ఇది అంటూ ఒకింత ఎమోషనల్ టచ్ ఇస్తుంటారు. అక్కడితో అంతే సంగతులు.. మళ్లీ పర్యటనకు వచ్చినప్పుడు సేమ్ సీన్ రిపీట్. ఇలా ముప్పై ఏళ్లుగా నెట్టుకొచ్చేస్తున్న బాబు ఇక్కడి పరిస్థితి ఏంటీ.. టీడీపీ నేతల వ్యవహారశైలి ఎలా ఉందని కూడా కనిపెట్టలేకపోయారు. అందుకే ఆయన పేరు చెప్పుకుని ఇక్కడి టీడీపీ నేతలు రెచ్చిపోతుంటారు. పీఏ మనోహర్ మొదలు కుప్పం పట్టణానికి చెందిన చోటామోటా నేతలు సైతం అడ్డగోలు సంపాదన రుచి మరిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పంను చెరబట్టేశారు.
సుధాకర్, వంద పడకల అస్పత్రి చైర్మన్, టీడీపీ నేత..
ప్రస్తుతం కుప్పం వందపడకల ఆస్పత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సుధాకర్ చిట్టా కూడా తక్కువేమీ లేదు. కుప్పం మేజర్ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు పంచాయతీ నిధులు దురి్వనియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. వంద పడకల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా డ్రా చేశారన్న విమర్శలు ఉన్నాయి. తన భూమికి ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయించుకోవడం, డీకేటీ భూముల దురాక్రమణ, కనమానపల్లి శ్రీనివాస స్వామి దేవస్థానానికి చెందిన భూములు, నకనపల్లి వద్ద దేవదాయ భూముల ఆక్రమణల్లోనూ సుధాకర్ ప్రమేయంపై ఆరోపణలున్నాయి.
త్రిలోక్ నాయుడు, కుప్పం మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థి..
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అనిమిగానిపల్లెకు చెందిన త్రిలోక్‌ను త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. ఇందులో టీడీపీయేతర వర్గాలకు వచ్చిన అభ్యంతరం లేదు కానీ ఎన్నో అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన త్రిలోక్‌ను ఎంపిక చేయడంపై స్వయంగా టీడీపీ వర్గాలే భగ్గుమంటున్నాయి. అనిమిగానిపల్లి సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో త్రిలోక్ పంచాయతీ డబ్బులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డీకేటీ భూములను కూ డా విక్రయించారనే విమర్శలున్నాయి.
టీడీపీ నేత పీఎస్ మునిరత్నం అటవీ భూముల్లో నిర్మించుకున్న చెక్‌డ్యాం
కుప్పంలోని టూరిజం హోటల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసుకుని రియల్ దందా చేశారన్న నిందారోపణలు ఉన్నాయి. ఇక టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్‌వర్క్ నడిపి ఇష్టానుసారంగా దోచేశారన్న అప్రతిష్ట మూటకట్టుకున్నారు. పట్టణంలో కేబుల్ నెట్‌వర్క్‌ని దెబ్బతీసి ఏపీ ఫైబర్‌ను బలవంతంగా అంటకట్టి.. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును మింగేశారని ఈయనపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికీ విచారణ సాగుతోంది. ఇంతటి ‘ఘన’మైన చరిత్ర కలిగిన త్రిలోక్‌ను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంపై టీడీపీ వర్గాలే ఈసడించుకుంటున్నాయి.
మాజీ సర్పంచ్ వెంకటేష్ బహుళ అంతస్తుల భవనం
మణి, మాజీ సర్పంచ్, డీకే పల్లి, టీడీపీ నేత
ఒక్కసారి సర్పంచ్‌గా పనిచేస్తే చాలు.. ఎన్ని కోట్లు అక్రమంగా సంపాదించవచ్చనే విషయానికి ఉదాహరణ చూపించాలంటే టీడీపీ నేత డీకే పల్లి మాజీ సర్పంచ్ మణిని చూపిస్తే చాలని స్వయంగా టీడీపీ వర్గాలే అంగీకరిస్తాయి. సర్పంచ్ హోదాను అడ్డుపెట్టుకుని రియల్ వ్యాపారంతో అడ్డగోలు సంపాదనకు తెరలేపారు. కుప్పం పట్టణానికి డీకేపల్లి కూతవేటు దూరంలో ఉండటంతో భూముల విలువ పెరగడంతో ఈయన డీకేటీ స్థలాలు, మోడల్ కాలనీ ప్లాట్లు, హౌసింగ్ పట్టాలు విచ్చల విడిగా విక్రయించేశారు. అక్కడితో ఆగకుండా ఓ రిటైర్డ్ తహశీల్దార్ పేరిట నకిలీ పట్టాలు కూడా విక్రయించారనే ఆరోపణలున్నాయి. ఇక సర్పంచ్‌గా ఇష్టారాజ్యంగా డబ్బులు డ్రా చేశారన్న విమర్శలనూ మూటకట్టుకున్నారు.
టీడీపీ నేత పి.గోపీనాథ్ బినామీ పేర్లతో అద్దెకు ఇచ్చిన పంచాయతీ దుకాణాలు
ఆర్‌ఆర్ రవి, గంగమ్మ గుడి మాజీ చైర్మన్, టీడీపీ నేత..
ఈయన పట్టణంలో పేరొందిన వడ్డీ వ్యాపారి. అధిక వడ్డీలతో పేద, మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేసే వడ్డీ రవిగా పేరు. టీడీపీ హయాంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్‌గా పని చేసి చివరికి అమ్మవారికి వచ్చిన విరాళాలు కూడా దురి్వనియోగం చేశారనే అపకీర్తిని సాధించుకున్నారు.
కేవి శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు..
కుప్పంలో గ్రానైట్ అక్రమ వ్యాపారానికి తెర తీసిన వ్యక్తి ఎవరంటే మొదటగా టీడీపీ నేత కేవీ శ్రీనివాసులు పేరే చెబుతారు. అనుమతుల్లేకుండానే.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమంగా గ్రానైట్ తరలింపులో ఈయన చాలా పేరు గడించారు. కుప్పం వారధి వద్ద నిబంధనలను అతిక్రమించి భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు.
వీళ్లే కాదు.. ఇంకా చాలామంది చోటామోటా టీడీపీ నేతలు కూడా ఇదే దారిలో ఉన్నారు. పాతపేట సోమేశ్వరస్వామి దేవాలయం భూములను టీడీపీ నేత ఆర్‌ఆర్ రవి ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆయనకు పట్టణ నడి»ొడ్డున ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా దేవాలయం భూమేనన్న వాదనలున్నాయి. టీడీపీకే చెందిన మాజీ సర్పంచ్ ప్రతాప్ డీకేటీ భూములు, కాలువ గట్టు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారనే విమర్శలున్నాయి. మాజీ ఎంపీటీసీ వేలుపై తమిళనాడులో ఎన్నో పోలీసు కేసులు ఉన్నాయి. ఇక మంజునాథ్, జిమ్ దాము అనే టీడీపీ నేతలు మీటర్ వడ్డీ వ్యాపారం, సెటిల్‌మెంట్లలో మునిగితేలుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment