అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న టీడీపీ నేతలు
టిప్పర్లతో పెద్ద ఎత్తున మట్టి తరలింపు
భారీగా జేబులు నింపుకొంటున్న తెలుగు తమ్ముళ్లు
తవ్వకాలతో బలహీనపడుతున్న గట్టు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు
పట్టించుకోని ఇరిగేషన్, మైనింగ్ అధికారులు
ద్వారకాతిరుమల: తమ అక్రమ సంపాదన కోసం టీడీపీ నేతలు ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఏం చేసినా అడిగే వారు లేరన్న ధైర్యంతో బరితెగిస్తున్నారు. జేబులు నింపుకోవడమే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలవరం కుడి కాలువ గట్లపై కొందరు తెలుగు తమ్ముళ్లు కన్నేశారు. 24 గంటలూ యథేచ్ఛగా కాలువ గట్టును తవి్వ, ఎంతో విలువైన మట్టిని తరలించేస్తున్నారు.
టిప్పర్ మట్టిని వేలాది రూపాయలకు అమ్మి, జేబులు నింపుకొంటున్నారు. ఈ తవ్వకాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గట్టు బలహీనపడిపోతోందని, వరదల సమయంలో ఇది ప్రమాదకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని ఎం.నాగులపల్లిలో పోలవరం కుడికాలువ గట్టును గత కొంత కాలంగా తవ్వి మట్టి తరలిస్తున్నారు.
టీడీపీ పెద్దల అండదండలు, సూచనలతో స్థానిక సంస్థలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఈ దందా నడిపిస్తూ డబ్బు దండుకుంటున్నారు. పొక్లెయిన్ సహాయంతో తవి్వన మట్టిని టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏవిధమైన అనుమతులూ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నా ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
దూరాన్ని బట్టి ధర
మట్టిని తరలించే దూరాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం నుంచి ఏలూరుకు వెళ్లే ఒక్కో టిప్పర్ నుంచి రూ. 7 వేలు, భీమవరం పరిసర ప్రాంతాలకు వెళ్లే ఒక్కో టిప్పర్ నుంచి రూ.12 వేలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లను చదును చేయడానికి, చేపల చెరువుల గట్ల నిర్మాణానికి ఈ మట్టిని వినియోగిస్తున్నారు.
రైతులకు తప్పని ఇక్కట్లు
తవ్వకాలు జరుగుతున్న కాలువ గట్టు వెంబడి వ్యవసాయ భూములు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టిప్పర్ల ధాటికి కాలువ గట్టు మార్గం పెద్ద పెద్ద గుంతలు పడి అధ్వానంగా మారుతోందని, వేగంగా వెళుతున్న టిప్పర్ల వల్ల ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment