నాగలాపురం మండలం కడివేడు రెవెన్యూ పరిధిలోని చాకలితిప్ప కొండ భూములు
తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రభుత్వ, చెరువు, కాలువ పోరంబోకు భూములు అన్యాక్రాంతమయ్యాయి. నాటి పాలకులు, అధికారులను నయానోభయానో బెదిరించి, భూములను దర్జాగా ఆక్రమించారు. వాటిని అమ్మి జేబులు నింపుకున్నారు. ఆనాటి టీడీపీ పాపాలు ఇప్పుడు అధికారులను వెంటాడుతున్నాయి. తాజాగా నాగలాపురంలో చోటుచేసుకున్న భూ ఆక్రమణ ఉదంతంలో రెవెన్యూ అధికారులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సాక్షి, తిరుపతి: సత్యవేడు నియోజక వర్గ పరిధిలోని నాగలాపురం మండలం కడివేడు గ్రామం సర్వే నంబర్ 27లో 143.85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని చాకలతిప్ప కొండ పోరంబోకు. ఇందులో కోట్ల విలువ చేసే విలువచేసే 38.88 ఎకరాలను నాటి తహశీల్దార్ 11 మంది టీడీపీ నాయకులకు కట్టబెట్టారు. అది కూడా టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు ఇద్దరు తహశీల్దార్లు అప్పగించినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ శ్రేణులకు భూములు కట్టబెట్టడంపై అప్పట్లో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటి పాలకులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అక్రమార్కులపై కొరడా ఝళిపిస్తోంది. నాగలాపురం మండలంలో భూ కేటాయింపులపై సంబంధిత అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.
రెవెన్యూ శాఖలో కలకలం
అక్రమార్కులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో రెవెన్యూ శాఖలోని కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైంది. శ్రీరంగరాజపురం మండలం చిన్నతయ్యూరులో టీడీపీ హయాంలో లేని భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. గ్రామంలో సర్వే నంబర్ 285/2 చివరిది. అయితే నాడు టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కొందరు కుమ్మక్కై సర్వే నంబర్ 286/1, 2, 3, 4, 5, 6, 287, 288, 293/4 సృష్టించి 29.33 ఎకరాల భూమి ఉన్నట్లు వెబ్‌ల్యాండ్‌లో చూపించారు. రెవెన్యూ రికార్డులు పెట్టి బ్యాంకుల్లో భారీగా రుణాలు పొందారు. ఇది అప్పట్లో వెలుగులోకి వచ్చినా టీడీపీ అధికారంలో ఉండటంతో అక్రమాలను తొక్కిపెట్టారు. అలాగే, తిరుపతి అర్బన్ పరిధిలో అక్కారాంపల్లె సర్వే నంబర్ 115/2బిలో 201 అంకణాలను మూడు డాక్యుమెంట్లతో భూమిని కొనుగోలు చేసినట్లు రిజిస్టర్ మార్టిగేజ్‌లో చూపించారు.
అయితే ఈ సర్వే నంబర్ నిషేధిత జాబితాలో ఉండటం గమనార్హం! అందులో భవన నిర్మాణానికి అనుమతి లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ పేరిట రిజిస్టర్ చేసిన మార్టిగేజ్ దస్తావేజులో సర్వే నంబర్ మార్పులు చేశారు. సర్వే నంబర్ 115/2సీలో ఉన్నట్లు తిరుపతి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. అలా చేయడం వలన భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఇలా తిరుపతి పరిసర ప్రాంతాల్లో కొందరు రెవెన్యూ, రిజిస్టార్ కార్యాలయ అధికారులు కుమ్మక్కై లేని సర్వే నంబర్లను సృష్టించి...ప్రభుత్వ, చెరువు, కాలువ పోరంబోకు భూములను ఆక్రమించుకున్నారు. ఇంకా 22–ఏలో ఉన్న భూములను తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉదంతాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment