శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాంపై పేపర్లు విసురుతూ.. దాడి చేస్తున్న టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: ఈసారి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి సభను అడ్డుకోవడమే లక్ష్యంగా నిత్యం రచ్చరచ్చ చేస్తున్న టీడీపీ సభ్యుల దుశ్చర్య సోమవారం పరాకాష్టకు చేరుకుంది. ఏకంగా సభాపతి తమ్మినేని సీతారాంపై దాడికి తెగబడ్డారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు తమ వికృత చేష్టలను బయటపెట్టారు.
సభాపతిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనా దాడిచేశారు. చివరకు మార్షల్స్‌ను కూడా పిడిగుద్దులు గుద్దుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. శాసనసభ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనపై స్పీకర్ తమ్మినేని తీవ్ర మనస్తాపంతో సభ నుంచి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా వారు నినాదాలు చేస్తూ నానా రచ్చచేశారు.
సభ ప్రారంభం కాగానే గలాటా..
సభ సోమవారం ఉదయం ప్రారంభం కాగానే జీఓ–1 రద్దు మీద తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ముందుగా వాయిదా తీర్మానం చదివి వినిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు డిమాండ్ చేయగా.. ‘వాయిదా తీర్మానం ఎప్పుడు చర్చకు అనుమతించాలో నాకు తెలుసు.. ముందు మీరు కూర్చోండి’ అంటూ స్పీకర్ కోరారు.
ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానంపై నిర్ణయం తీసుకుంటానని చెబుతూ స్పీకర్ క్వశ్చన్ అవర్‌ను ప్రాంభించారు. ఈ సమయంలో మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెబుతుండగానే అచ్చెన్నాయుడు స్పీకర్ వైపు వేలు చూపిస్తూ ముందు తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని సభలో చదివి వినిపించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు.
దీనిపై స్పీకర్ అసహనం వ్యక్తంచేస్తూ ‘చైర్‌ను మీరు డిక్టేట్ చేస్తున్నారా?’ అనడంతో టీడీపీ సభ్యులంతా ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
స్పీకర్ పోడియం ఎదుట వైఎస్సార్‌సీపీ సభ్యులను నెట్టివేస్తున్న టీడీపీ సభ్యులు
చర్చలో పాల్గొనాలని ఎంత చెప్పినా...
‘సభ ప్రారంభమై పట్టుమని పది నిమిషాలు కూడా కాకుండానే మీరు ఇలా ప్రవర్తించడం సరికాదు.. దయచేసి పద్ధతి మార్చుకోండి..’ అని స్పీకర్‌తో సహా మంత్రులు హితవు పలికినా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా వెల్ నుంచి పోడియంపైకి ఎక్కి స్పీకర్ చైర్‌కు ఇరువైపులా చేరి పెద్దఎత్తున నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
మరోవైపు.. స్పీకర్ టేబుల్‌పై ఉన్న పుస్తకాలు, పత్రాలు చించివేస్తూ ఆయన ముఖంపైకి విసరడం ప్రారంభించారు. కిందనున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ శాసనసభ సిబ్బంది వద్ద ఉన్న ప్రొసీడింగ్స్ కాపీలను పోడియంపైనున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు అందించగానే అతను వాటిని చించి స్పీకర్‌పై విసరడం మొదలుపెట్టారు.
ఓ వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరోవైపు స్పీకర్ చైర్‌ను చేతులతో కొడుతూ కాగితాలు చించి విసిరారు. ఈ సమయంలో స్పీకర్ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా ‘దయచేసి పోడియం దిగి మీ మీ స్థానాల్లో వెళ్లి కూర్చోండి. ప్రశ్నోత్తరాల్లో పాల్గొనండి’.. అంటూ పదేపదే విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులు ఆయన్ను పట్టించుకోకుండా గొడవ చేస్తూనే ఉన్నారు.
ఎస్సీ ఎమ్మెల్యేలపై దాడి..
అదే సమయంలో.. తమ హక్కులు కాపాడాలంటూ వెల్ బయటి నుంచి విన్నవిస్తున్న చింతలపూడి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా సభాపతిపై జరుగుతున్న దాడిని గమనించి పోడియం పైకెళ్లి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని అడ్డుకోవడంతో ఆయనను టీడీపీ సభ్యులు తోసేసారు.
స్పీకర్‌తోపాటు సహచర ఎమ్మెల్యే ఎలీజాపై టీడీపీ సభ్యులు భౌతిక దాడి చేస్తుండడంతో సంతనూతలపాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పోడియంపైకి వచ్చి వారిని అడ్డుకోబోయారు. ఆయనపైనా దాడికి పాల్పడుతూ పక్కకు తోసేయడంతో సుధాకర్‌బాబు పోడియం హ్యాండ్ రెయిలింగ్‌పై పడిపోయారు. దీంతో సుధాకర్‌బాబు ఎడమ మోచేతికి గాయమైంది. పట్టుతప్పితే ఆయనకు పెద్ద ప్రమాదమే జరిగేది.
టీడీపీ సభ్యుల దాడిలో గాయపడిన దళిత ఎమ్మెల్యే సుధాకర్‌బాబు
అయినా, టీడీపీ సభ్యుల అరాచకం ఆగలేదు. సుధాకర్‌బాబుతో పాటు ఎలీజాపై దాడిచేస్తూనే ఉన్నారు. వారి నుంచి తమ సభ్యులను కాపాడుకునేందుకు సభలో ఉన్న మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు వెల్ నుంచి పైకి వెళ్లబోతుండగా వారిని తోసుకుంటూ టీడీపీ సభ్యులు కిందకు వచ్చేశారు. ఈ దశలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సస్పెన్షన్ అయ్యాక.. మార్షల్స్‌పై పిడిగుద్దులు
అర్ధగంట అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ చేసినందున దయచేసి సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినా, వారు అక్కడే బైఠాయించబోయారు.
బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్న మార్షల్స్‌పైనా పిడిగుద్దులతో దాడికి దిగారు. చివరికి డోలాను బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లగా, ఆయన వెంట మిగిలిన టీడీపీ సభ్యులు కవ్విస్తూ బయటకెళ్లారు.
డిప్యూటీ సీఎంపై ‘డోలా’ అనుచిత వ్యాఖ్యలు
తనపై జరిగిన దాడితో పాటు సభలో టీడీపీ సభ్యుల దుశ్చర్యకు మనస్తాపం చెందిన స్పీకర్ సీతారాం సభ నుంచి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. ఇంతలో మార్షల్స్ టీడీపీ సభ్యులను బలవంతంగా వారి స్థానాల దగ్గరకు తీసుకెళ్లారు.
రోజూ రచ్చచేయడం టీడీపీ సభ్యులకు అలవాటుగా మారిందని, ఈరోజు ఏకంగా సభాపతిపైనే దాడులకు తెగబడ్డారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనడంతో.. ‘నువ్వొక డిప్యూటీ సీఎం అంట్రా.. పనికిమాలిన నా కొడకా’.. అంటూ డోలా బాలవీరాంజనేయ స్వామి పరుష పదజాలంతో నానా దుర్భాషలాడడంతో మిగిలిన సభ్యులు ఆయన్ని వారించారు.అక్కడ నుంచి స్పీకర్, సీఎం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ సభ్యులు రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూనే ఉన్నారు.
అటెండర్‌ను తోసేసి స్పీకర్‌పైకి దూసుకొచ్చి..
ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుకు నిరసనగా మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో మాట్లాడుతుండగా, స్పీకర్ అటెండర్‌ను పక్కకు తోసేసిన టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి స్పీకర్‌కు అడ్డంగా నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఓ వైపు వీరాంజనేయస్వామి, మరోవైపు వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు చైర్‌పై స్పీకర్ చేతులు కూడా పెట్టుకోనీయకుండా ఇబ్బంది కల్గిస్తూ స్పీకర్ ముఖానికి ప్లకార్డులు అడ్డంపెట్టారు.
అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, చినరాజప్ప కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి స్పీకర్ ముఖంపై ప్లకార్డును అడ్డంగా పెట్టడంతో పాటు ఆయనపై చేయిచేసుకున్నారు. ప్ల్లకార్డు స్పీకర్ కంటికి తగలడంతో ఆయన దాన్ని పక్కకు తోసివేయడంతో అది కిందపడింది. దీంతో డోలా బాలవీరాంజనేయస్వామితో పాటు టీడీపీ సభ్యులు స్పీకర్ చైర్ చుట్టూ మూగి ఆయనపై దాడికి తెగబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment