సాక్షి, రాజమహేంద్రవరం: ఎలాంటి తప్పూ చేయకపోయినా అరెస్టు చేస్తే ప్రతిఘటించడం చూసుంటాం. అక్రమాలతో సంబంధం లేకున్నా పోలీసులు అదుపులోకి తీసుకుంటే నిరసన తెలిపే నేతలను చూసుంటాం. కానీ, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ నేతలు పడిన పాట్లు విడ్డూరంగా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టుపై నిరసనలకు టీడీపీ శ్రేణులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రజల నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఆందోళన కాస్తా అభాసుపాలైంది.
ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్న వారి కుట్ర ఫలించలేదు. మరోపక్క ఇప్పటికే చంద్రబాబు వ్యవహార శైలితో విసిగిపోయిన పార్టీ శ్రేణుల్లో కొందరు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనలకు పెద్దగా ఆసక్తి చూపలేదు. రోడ్డు పైకి వెళ్లి నిరసన తెలపడం ఎందుకని భావించి, ముందస్తుగా హౌస్ అరెస్టు అయ్యారు. ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా రోడ్డుపై పడి ప్రభుత్వంపై బురద జల్లే టీడీపీ నేతలు.. చంద్రబాబు అవినీతి కుంభకోణంలో అడ్డంగా బుక్కయిపోవడంతో పూర్తి స్థాయిలో రోడ్డెక్కలేదు. నామ్ కా వాస్తే అన్న చందంగా కొంతసేపు నిరసనలు తెలిపి ఇళ్లకు జారుకున్నారు.
ఓవర్ యాక్షన్
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ‘పచ్చ’ నేతలు అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేశారు. దుకాణాలు మూసివేయాలంటూ యజమానులపై చిందులు తొక్కారు. ఎవరూ స్పందించకపోవడంతో వెనక్కు తగ్గారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా లాభం లేకపోవడంతో చేసేది లేక వెనుదిరిగారు. కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా షాపులు మూయించారు. వారు వెళ్లిన గంటల వ్యవధిలోనే వ్యాపారులు తిరిగి దుకాణాలు తెరచి యథావిథిగా వ్యాపారాలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఆర్టీసీ బస్సులను ఉదయం డిపోలకే పరిమితం చేశారు. మధ్యాహ్నం నుంచి యథావిధిగా నడిపారు.
పటిష్టంగా పోలీసు బందోబస్తు
చంద్రబాబు అరెస్టు దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఆయన అరెస్టయిన క్షణం నుంచే శాంతిభద్రతల పరిరక్షణకు రంగంలోకి దిగారు. అక్కడక్కడ రోడ్లపైకి వచ్చిన టీడీపీ శ్రేణులను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ నిలువరించారు. ఆందోళన ఉధృతమైతే అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్లకు తరలించి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఫలితంగా జిల్లాలో ఎటువంటి హింసాత్మక ఘటనలూ చోటు చేసుకోలేదు.
బంద్‌కు స్పందన నిల్
జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం నగరంలో ఎటువంటి బందూ జరగలేదు. వ్యాపార సముదాయాలు, సినిమాహాళ్లు, ప్రైవేటు కార్యాలయాలు యథావిధిగా తెరచుకున్నాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి ఇళ్ల వద్ద ఆందోళనకు దిగగా, పోలీసులు అరెస్తు చేశారు. గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో రోడ్డుపై ఆందోళన చేస్తూ, జన జీవనానికి అంతరాయం కలిగిస్తున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేతలు బంద్ చేయిస్తే గంట వ్యవధిలోనే తిరిగి షాపులు తెరిచారు. నిడదవోలులో షాపులు మూసేయాలని టీడీపీ నేతలు హంగామా చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అనపర్తి నియోజకవర్గంలో బంద్ ప్రభావం కనిపించ లేదు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా స్పందన లేకపోయింది. రాజానగరంలో టీడీపీ నేతలు మొక్కుబడిగా కొద్దిసేపు ఆందోళన చేసి, వెళ్లిపోయారు.
చంద్రబాబు తప్పు చేయకపోతే న్యాయస్థానంలో రుజువు చేసుకోవాలి. కోట్లాది రూపాయలు లూటీ చేసిన ఆయనను అరెస్టు చేస్తే టీడీపీ శ్రేణులు గగ్గోలు పెట్టడం ఎందుకు?
– డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్యే, అనపర్తి
చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆయన అరెస్టులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు, కుట్రలు, కక్ష సాధింపులు లేవు.
– తలారి వెంకట్రావు, ఎమ్మెల్యే, గోపాలపురం
నైపుణ్య శిక్షణ పేరుతో రాష్ట్ర యువత భవిష్యత్తును తాకట్టు పెట్టి, ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదు.
– జి.శ్రీనివాస్‌నాయుడు, ఎమ్మెల్యే, నిడదవోలు
చంద్రబాబు నాటకాలకు ప్రజలు మోసపోయే రోజులు పోయాయి. ధర్మం, న్యాయం ప్రకారమే చంద్రబాబు అరెస్టు జరిగింది.
– డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, రాజమహేంద్రవరం సిటీ
పాపం పండి అవినీతి సమ్రాట్ చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయనతో సహా చట్టానికి ఎవరూ అతీతులు కారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న చంద్రబాబు బండారం ఆధారాలతో సహా బయట పడటం వల్లనే సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇది చట్ట పరిధిలో జరిగింది. ఆయన ఏ తప్పూ చేయకపోతే చట్టం ముందు తన నిర్దోషిత్వం నిరూపించుకోవాలి. కక్ష సాధింపు అంటూ రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. రానున్న రోజుల్లో ఆయన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి, రాజకీయంగా సమాధి కావడం తథ్యం.
– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి
నాడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన పేద ముస్లిం యువకులపై చంద్రబాబు నంద్యాలలో దేశద్రోహం కేసులు పెట్టి, జైలుకు పంపారు. నేడు అదే నంద్యాలలో యువతకు నైపుణ్యాన్ని ఇచ్చే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయ్యారు. నేరాలు రుజువైతే ఆయన జీవితమంతా జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి.
– ఆరిఫ్, జిల్లా వక్ఫ్‌బోర్డ్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment