సాక్షి, శ్రీకాకుళం: ‘గత ఎన్నికల్లో అమరావతి రాజధాని నినాదంతోనే టెక్కలిలో గెలిచా. ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతికే మద్దతు పలకాలి. అమరావతి రైతుల పాదయాత్రకు ఘనస్వాగతం పలకాలి.’ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి. ఉత్తరాంధ్రలో పుట్టి. ఇక్కడే పెరిగి.. ఇక్కడి నుంచే ఎన్నిౖకైన అచ్చెన్నాయుడు విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దంటే వద్దంటూ నినాదాలు చేస్తున్నారు.
అమరావతికి మాత్రమే జై కొట్టాలని, రియల్ ఎస్టేట్ రైతులు చేస్తున్న పాదయాత్రకు ఘనస్వాగతం పలకాలని బహిరంగంగా చెబుతున్నారు. పుట్టి పెరిగిన ప్రాంతంపై విషం చిమ్ముతున్న అచ్చెన్న వైఖరిని జిల్లా ప్రజలు దునుమాడుతున్నారు. ఒక్క అచ్చెన్నాయుడే కాదు చంద్రబాబుతో అంట కాగే పెద్ద నాయకులంతా ఇదే స్వరం వినిపిస్తున్నారు. టీడీపీ ద్వితీయ శ్రేణి కేడర్‌లో మాత్రం అమరావతి అజెండాపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమరావతిలో రాజధాని వద్దని ఎవరూ అనడం లేదని, మన ప్రాంతానికొక రాజధాని ఇస్తామన్నప్పుడు అడ్డుకోవడమేమిటని అధిష్టానంపై గుర్రు మంటున్నారు.
చదవండి: (టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్న వాసు, బీటెక్ రవి)
మరోవైపు పరిపాలన వికేంద్రీకరణను ప్రజలంతా ఆహ్వానిస్తున్నారు. మేధావులు స్వాగతిస్తున్నారు. రైతు, వ్యాపార, ఉద్యోగ, కార్మిక, ఇతరత్రా వర్గాలన్నీ మద్దతు పలుకుతున్నాయి. కానీ ప్రతిపక్షం టీడీపీ మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకోవడమే కాదు గట్టిగా పట్టుబడుతోంది. వీరి స్వార్థాన్ని ప్రజలు మాత్రం గుర్తించారు. అమరావతిలో కొన్న భూముల విలువ పడిపోకుండా టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకుని ఆగ్రహిస్తున్నారు.
సిక్కోలులో ప్రస్తుతం ఎక్కడ చూసినా మూడు రాజధానుల చర్చే జరుగుతోంది. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై మద్దతు పెరుగుతోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయబోతున్నట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే వెనుకబడిన జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అభివృద్ధికి నోచుకుంటాయని స్థానికులు ఆశిస్తున్నారు. పొట్ట కూటి కోసం వలస పోయే పరిస్థితి తగ్గుతుందని భావిస్తున్నారు. అందుకనే అన్ని వర్గా లు మూడు రాజధానుల ప్రకటన, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నాయి. కానీ ప్రతిపక్ష టీడీపీ అగ్రనేతల చేష్టలు చూస్తుంటే వెనకబడిన జిల్లాలకు నష్టం చేసేలా ఉన్నారని, ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని జిల్లా ప్రజలంటున్నారు.
ఉద్యమం తప్పదు
ఉత్తరాంధ్రకు ద్రోహం చెయ్యాలని చూస్తే ఉద్యమం తప్పదు. అచ్చెన్నాయుడు అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలకాలని చెప్పడం హేయం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి.
– జీవీ రెడ్డి మాస్టారు, మేధావుల ఫోరం అధ్యక్షుడు, టెక్కలి
అచ్చెన్న వ్యాఖ్యలు అర్థరహితం
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలన్నీ స్వార్థపూరితమే. అమరావతి లో పెట్టుబడులు పెట్టిన టీడీ పీ నాయకులు వాటిని కాపాడుకోవడానికి కుటిల యత్నా లు చేస్తున్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. విశాఖ రాజధానితో ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుంది. కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి.
-యర్రగుంట్ల కృష్ణమోహన్, న్యాయవాది, మందస
వాస్తవాలు తెలుసుకోవాలి
అచ్చెన్నాయుడు జిల్లా అభివృద్ధి కోసం కాకుండా చంద్రబాబు అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. మూడు రాజధానులలో అమరావతి ప్రాంతానికి కూడా ప్రాధాన్యం ఇస్తూ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అమరావతి అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఇది తెలుసుకుని అచ్చెన్నాయుడు మాట్లాడితే మంచిది.
– రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం
అధికార వికేంద్రీకరణతోనే ప్రగతి
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణతోనే ప్రగతి సాధ్యం. భవిష్యత్‌లో ప్రత్యేక రాష్ట్ర నినాదాలు రాకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించాలి. మూడు రాజధానుల మోడల్ వికేంద్రీకరణ సిద్ధాంతం అమలు ప్రస్తుతం అత్యవసరం.
– ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వ వైస్‌చాన్సలర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం.
Comments
Please login to add a commentAdd a comment