కూలిన ‘దేశం’ కంచు కోటలు | TDP Massive Defeat In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కూలిన ‘దేశం’ కంచు కోటలు

Published Fri, Feb 19 2021 5:03 AM | Last Updated on Fri, Feb 19 2021 9:42 AM

TDP Massive Defeat In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: తొలి రెండు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలే మూడో విడతలోనూ పునరావృతం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అభిమానులు పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లో సహా అన్నింటా ఆ పార్టీ కుదేలైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మొదలు.. శ్రీకాకుళం జిల్లా వరకు అన్నింటా టీడీపీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడున్నర దశాబ్దాల కాలంలో ఏకఛత్రాధిపత్యంగా టీడీపీ పాగా వేసిన కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు.

అధిక పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు డిపాజిట్లు కోల్పోయారు. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్‌సీపీ అభిమానులు 75 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ మద్ధతుదారులు మాత్రం కేవలం 14 స్థానాలకే పరిమితం అయ్యారు. అదే 2013లో 93 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అప్పట్లో 12 చోట్ల మాత్రమే వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆ సీన్‌ రివర్స్‌ అయ్యింది. నియోజకవర్గంలోని గుడిపల్లి, కుప్పం, శాంతిపురం, రామకుప్పం ఇలా నాలుగు మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు తిరుగులేని విజయం సాధించారు. 

చదవండి: (కుప్పం కూడా చెప్పింది.. గుడ్‌ బై బాబూ)

కుప్పంలో మొత్తంగా 30 వేల మెజార్టీ
♦కుప్పం నియోజకవర్గంలో వైస్సార్‌సీపీ అభిమానులకు వచ్చిన ఓట్లను లెక్కిస్తే 30 వేలకు పైగానే మెజార్టీ దాటింది. వివిధ కారణాలతో ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించి ఉంటే మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉండింది.
♦టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న అమర్నాథ్‌రెడ్డికి చెందిన పలమనేరు నియోజకవర్గంలో 90 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, 76 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు, కేవలం 13 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. 
♦అమర్నాథ్‌రెడ్డి మరదలు అనీషరెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులో ఒక్క స్థానంలో కూడా టీడీపీ బోణీ కొట్టలేకపోయింది. మొత్తం 85 పంచాయతీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. 

‘అనంత’లోనూ భంగపాటు
♦ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో 117 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్‌సీపీ అభిమానులు 93 స్థానాల్లో, టీడీపీ 20, ఇతరులు రెండు చోట్ల మాత్రమే గెలుపొందారు. 
♦ శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండలం కెకె అగ్రహారం మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్వగ్రామం. ఇక్కడ కూడా వైఎస్సార్‌సీపీ అభిమానే విజయం సాధించడం విశేషం.
♦తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు పంచాయతీ ఎన్నికల్లోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 85 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, ఇందులో 53 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు, 28 చోట్ల టీడీపీ, నాలుగు చోట్ల ఇతరులు గెలుపొందారు. 
♦ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని 68 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా 52 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు, కేవలం 13 చోట్ల టీడీపీ, రెండు చోట్ల ఇతరులు విజయం సాధించారు.
♦ రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత ప్రభావం ఏమీ కన్పించలేదు. 38 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ మద్దతుదారులు కేవలం 4 స్థానాలకే పరిమితం అయ్యారు. వైఎస్సార్‌సీపీ అభిమానులు 34 చోట్ల ఘన విజయం సాధించారు. 
♦ అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో 3 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్‌సీపీ అభిమానులే ఘన విజయం సాధించారు. 
♦ గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌.జితేంద్రగౌడ్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక్కడ ఎన్నికలు నిర్వహించిన 68 పంచాయతీల్లో 55 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుపొందారు. టీడీపీ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. 

చదవండి: (కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది)

స్పీకర్‌ తమ్మినేని సతీమణి విజయం
♦ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి, మాజీ చీప్‌ విప్‌ కూన రవికుమార్‌కు ఎదురుగాలి వీచింది. 108 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 75 చోట్ల వైఎస్సార్‌సీపీ, 33 స్థానాలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. తొగరాం సర్పంచ్‌గా స్పీకర్‌ తమ్మినేని సీతారం సతీమణి తమ్మినేని వాణి విజయం సాధించారు. 
♦ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయన స్వగ్రామం చల్లవానితోట పంచాయతీకి ఆయన మనుమడు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు తారకరామ నాయుడు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో మొత్తం 207 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 174 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, కేవలం 32 స్థానాల్లో టీడీపీ, ఒక చోట ఇతరులు గెలుపొందారు.

కర్నూలులోనూ అదే జోరు
♦ కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్‌ పప్పులేవీ ఉడకలేదు. ఈ నియోజకవర్గంలో 81 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 69 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు, 11 స్థానాల్లో టీడీపీ, ఒక చోట ఇతరులు విజయం సాధించారు. 
♦ మాజీ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన కేఈ కృష్ణమూర్తి నియోజకవర్గమైన పత్తికొండలోనూ టీడీపీకి ఎదురుగాలి వీచింది. 87 పంచాయతీలకుగాను 55 చోట్ల వైఎస్సార్‌సీపీ, 26 చోట్ల టీడీపీ, 6 చోట్ల ఇతరులు విజయం సాధించారు.
♦ టీడీపీ నాయకులు గౌరు చరిత, వెంకటరెడ్డి దంపతులు, బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిల నియోజకవర్గమైన నందికొట్కూరులో ఊహించని ఫలితాలొచ్చాయి. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్వగ్రామం ముచ్చుమర్రిలో వైఎస్సార్‌సీపీ అభిమాని విజయఢంకా మోగించారు. నియోజకవర్గంలో 77 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా 62 చోట్ల వైఎస్సార్‌సీపీ, 12 స్థానాల్లో టీడీపీ, బీజేపీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. 

గుంటూరు, కృష్ణాలో ‘దేశం’ డీలా
♦ గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ యరపతినేని శ్రీనివాసరావు స్వగ్రామం మంచికల్లులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 57 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 53 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, 3 స్థానాల్లో టీడీపీ, జనసేన మద్దతుదారులు ఒక చోట విజయం సాధించారు. 
♦ మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలకు గాను 75 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు నిర్వహించిన రెండు స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులే విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న అన్నపురెడ్డి అంజిరెడ్డి ఎక్కడా కూడా తన ప్రభావం చూపలేకపోయారు. 
♦ టీడీపీకి చెందిన మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్‌ నియోజకవర్గమైన కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ అభిమానులు అధిక స్థానాల్లో విజయం సాధించారు. 71 పంచాయతీలకుగాను 45 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు, 18 చోట్ల టీడీపీ, 5 స్థానాల్లో జనసేన, 3 చోట్ల ఇతరులు గెలుపొందారు.
♦ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గమైన మచిలీపట్నంలో టీడీపీ మద్దతుదారులు కేవలం 6 స్థానాలకే పరిమితం అయ్యారు. 17 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు, రెండు చోట్ల జనసేన మద్దతుదారులు గెలుపొందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement