ఇప్పటికే పీకల్లోతు మునిగిపోయిన పార్టీ. అధికారం వస్తుందో లేదో తెలియదు. రాకుంటే ఉనికి ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో ఎందుకైనా మంచిదనుకున్నారో ఏమో.. గుట్టుగా డిపాజిట్ల పర్వం మొదలుపెట్టినట్లు తెలిసింది. ‘నోట్ల కట్టలు కొట్టు.. టికెట్ పట్టు’ అంటూ కరాఖండీగా చెబుతున్నారని సమాచారం.
అనంతపురం: ‘ఓటుకు నోటు’ కేసుతో దేశంలోనే సంచలనం రేపిన టీడీపీ అధినేత.. తాజాగా ‘సీటుకు నోటు’ అనే కొత్త కాన్సెప్ట్ తెరమీదకు తెచ్చినట్లు తెలిసింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ కావాలంటే రూ.35 కోట్లు డిపాజిట్ చేయాల్సిందేనని షరతు విధించినట్లు సమాచారం. దీంతో ఆ పార్టీ నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికిప్పుడు అంత పెద్దమొత్తం అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆశావహులు తమ అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఆస్తులు అమ్మి లేదా అప్పు చేసి డబ్బు ముట్టజెప్పినా.. ఓడిపోతే ఆ తర్వాత తమ పరిస్థితి ఏంటనే అంతర్మథనం తమ పార్టీ నేతల్లో మొదలైందని జిల్లాలోని ఓ సీనియర్ నేత సన్నిహితుడు తెలిపారు.
కబ్జా స్థలం అమ్మకానికి..
కదిరి పట్టణంలోని కదిరి–హిందూపురం రహదారిలో ఉన్న ముస్లిం మైనార్టీలకు చెందిన మూడెకరాల స్థలాన్ని టీడీపీకి చెందిన నియోజకవర్గ కీలక నేత తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కబ్జా చేసి చుట్టూ కంచెవేశారు. టికెట్ కావాలంటే డబ్బు డిపాజిట్ చేయాల్సిందేనని పార్టీ పెద్దలు షరతు విధించడంతో దిక్కుతోచని స్థితిలో సదరు నేత కబ్జా స్థలాన్ని రూ.30 కోట్లకు అమ్మకానికి పెట్టినట్లు ఆ పార్టీ వర్గీయులు పలువురు చెబుతున్నారు. అది కూడా స్థలాన్ని స్థానికులకు కాకుండా స్థానికేతరులకు కట్టబెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. మొదట్లో కొనడానికి ఆసక్తి చూపిన కొందరు.. అది కాస్త కబ్జా స్థలమని తెలుసుకుని మెల్లిగా జారుకున్నట్లు తెలిసింది.
ఇదేం గోల..
పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేతకు కదిరిలో కళాశాల ఉంది. కార్పస్ ఫండ్ కోసం స్థానికంగా ఐదెకరాలను చూపి కళాశాల నడుపుతున్నారు. మరణించిన తన కుటుంబ సభ్యురాలి పేరుపై ఉన్న ఆ స్థలాన్ని ఎలాగైనా తన పేరున మార్చుకుని అమ్మేయడం ద్వారా టికెట్ కోసం డబ్బు సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ స్థలం మ్యూటేషన్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు సహకరిస్తున్నారన్న కారణంతో తహసీల్దార్‌ను ఇప్పటికే తప్పించారు. ఇదిలా ఉంటే.. సదరు నేతకు పుట్టపర్తి టికెట్ ఇవ్వకూడదని, ఈ సారి బీ ఫాం బీసీ నేతకే ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. ఒకవైపు డబ్బుతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు బీసీ గోల ఏంటని సదరు నేత తన అనుచరుల ఎదుట వాపోతున్నట్లు తెలిసింది.
సీనియర్ల గుర్రు
టికెట్ కోసం డబ్బు డిపాజిట్ చేయడానికి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఒప్పుకోవడం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతుంటే ఇప్పుడు నోట్ల కట్టలు ఉన్న వాళ్లకే టికెట్ అంటే ఎలా అని వారు మండిపడుతున్నట్లు సమాచారం. ధర్మవరం టీడీపీ టికెట్ కోసం రూ.50 కోట్లయినా డిపాజిట్ చేయడానికి సిద్ధమైన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నేత వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని, అదే జరిగితే ఆయన్ను ఓడించడం ఖాయమని వ్యతిరేక వర్గం అంటోంది. పెనుకొండలో ఇప్పటికే రెండు వర్గాల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే డబ్బు డిపాజిట్ అంశం ఆ నియోజకవర్గ టీడీపీ నేతల్లో కొత్త చిచ్చు రాజేస్తోంది. చంద్రబాబు డబ్బే ప్రధానమనే భావనతో ముందుకెళితే పార్టీ కనుమరుగు కావడం ఖాయమని ఆ పారీ్టకే చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment