కోస్తా తెలుగుదేశం అయోమయం.. ఉక్కిరిబిక్కిరవుతున్న తండ్రీకొడుకులు | TDP Seniors away from party functions in Costal Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కోస్తా తెలుగుదేశం అయోమయం.. ఉక్కిరిబిక్కిరవుతున్న తండ్రీకొడుకులు

Published Mon, Feb 20 2023 3:56 AM | Last Updated on Mon, Feb 20 2023 7:28 AM

TDP Seniors away from party functions in Costal Andhra Pradesh - Sakshi

రాష్ట్రంలో ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. వరుస ఎన్నికల్లో ఓటమిలతో చేతులు కాలు­తుంటే పట్టుకోవడానికి ఎక్కడా ఆకులు దొరకని దుస్థితి. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటున్న బాబును నమ్ముకుంటే ఇక తమ గతి అంతేనని ఆ పార్టీలోని అత్యధికులు ఇప్పటికే ఎవరి దారి వారు చూసుకుంటుంటే నిలువరించలేని దీన స్థితి. అక్కడక్కడా మిగిలిన కొద్దిపాటి శ్రేణులకు సరైన మార్గ నిర్దేశం లేక కింది నుంచి పైదాకా అంతటా అయోమయం. తమ ఏలుబడిలో ఏం వెలగబెట్టారో చెప్పుకోలేక.. ప్రస్తుత సర్కారు కంటే మెరుగ్గా ఏం చేస్తారో ఏడవ లేక తండ్రీకొడుకులు ఉక్కిరిబిక్కిరవుతున్న సీన్లు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. బాబు ఆశాదీపం పరిస్థితి దైవా‘దీనం’గా మారింది. 

సాక్షి ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, అమరావతి: మధ్య కోస్తాంధ్రలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దీనంగా మారింది. సీనియర్లు చేతులెత్తేయడంతో పలు జిల్లాల్లో పార్టీని నడిపించే నాథులే లేకుండాపోయారు. అధికారంలో ఉన్నప్పుడు హవా చెలాయించిన నేతలు ఇప్పుడు చంద్రబాబుకు మొహం చాటేస్తుండడంతో ఆయన కొత్త వారి కోసం అన్వేషణలో మునిగిపోయారు. పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించ లేక.. ఎవరు పార్టీలోకి వస్తారా అని ఎదురు చూపులు చూస్తున్నారు.

పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు, వలస నేతలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో కానుకలు ఆశ చూపి జనాన్ని రప్పించేందుకు ప్రయత్నించి ముగ్గురు మృతికి కారణమయ్యారు. మైదానాల్లో సభలు పెట్టేందుకు ధైర్యం చేయలేక.. ఇరుకు సందుల్లో సభల నిర్వహణకు మొగ్గు చూపుతున్నారు. వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోవడం తన వల్ల కాదని అర్థమవడంతో తోడు కోసం తహ తహ లాడుతున్నారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు.

సీనియర్లు చేతులెత్తేసిన పరిస్థితుల్లో కొత్త వారి కోసం చంద్రబాబు గేలం వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానై చక్రం తిప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. హైదరాబాద్‌లోనే ఉండి వ్యాపారాలు చూసుకుంటున్నారు.  టీడీపీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరైన గల్లా జయదేవ్‌ అడ్రస్‌ లేకుండా పోయారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. ఆయన తన నియోజకవర్గం గుంటూరులో పర్యటించి ఏడాది దాటిపోయింది.

ధూళిపాళ నరేంద్ర, ఆలపాటి రాజా వంటి నేతలు మొక్కుబడి కార్యక్రమాలు మినహా పార్టీలో చురుగ్గా తిరగడం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. తెనాలి సీటు పొత్తులో పోతుందనే ప్రచారం, గుంటూరు వెస్ట్‌లో కన్నా లక్ష్మీనారాయణ కర్చీఫ్‌ వేయడంతో ఆలపాటి రాజా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కీలకమై­న సత్తెనపల్లికి ఇప్పటి వరకు ఇన్‌ఛార్జినే నియమిం­చకపోగా, రిజర్వుడు నియోజకవర్గం పత్తిపాడు­లో జనరల్‌ వ్యక్తిని ఇన్‌ఛార్జిగా పెట్టాల్సిన పరిస్థితి నె­ల­కొంది. మాచర్లలో ఫ్యాక్షనిజాన్ని నమ్ముకున్నారు.  

‘తూర్పు’లో దీనావస్థ..  
► ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మాజీ మంత్రి యన­మల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ మధ్య విబేధాలు, ఆధిపత్య పోరు సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతూనే ఉంది. యనమల తన సొం­త నియోజకవర్గం తునిలోనూ తమ్ముడు కృష్ణుడితో విరోధం తెచ్చుకున్నారు. ఇన్నాళ్లూ తన­కు అండగా నిలిచిన సోదరుడిని పక్కన పెట్టి, త­న కుమార్తె దివ్యకు తుని ఇన్‌ఛార్జి పదవి ఇప్పించు­కో­వడంతో ఆయన కుటుంబంలో చిచ్చు రేగింది.   

► రాజమండ్రిలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. గోరంట్ల రాజమండ్రి నగరానికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఆదిరెడ్డి కుటుంబం అడ్డుకుంటోంది. చంద్రబాబు తనను అవసరానికి వాడుకుని పట్టించుకోవడం లేదని, ఆదిరెడ్డిని ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తితో గోరంట్ల రగిలిపోతున్నారు.   

► రాజానగరం, పి గన్నవరం, కొవ్వూరు నియోజకవర్గాలకు చంద్రబాబు ఇంతవరకు ఇన్‌ఛార్జిలనే నియమించలేకపోయారు. రాజానగరంలో పెందుర్తి వెంకటేష్‌ తప్పుకున్న తర్వాత కొత్త నాయకుడు దొరకలేదు. పెద్దాపురంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, బొడ్డు భాస్కరరామారావు కొడుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల చంద్రబాబు పర్యటనలో రాజప్పే పెద్దాపురం అభ్యర్థని ప్రకటించినా వెనువెంటనే బొడ్డు వర్గం ఆయన్ను అడ్డుకుని గందరగోళం సృష్టించింది.   

► పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ వర్మపై స్థానిక టీడీపీ నేతలంతా కట్టకట్టుకుని వెళ్లి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తోట త్రిమూర్తులు వైఎస్సార్‌సీపీలో చేరాక రామచంద్రాపురంలో టీడీపీయే లేకుండా పోయింది.   

► రంపచోడవరంలో టీడీపీ నిస్తేజంగా మారింది. చంద్రబాబు ఇచ్చిన పిలుపును తూర్పులో పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు మొన్న అనపర్తిలో సభకు ఇరుకు సందును ఎంచుకుని జనం ఎక్కువగా వచ్చినట్లు చూపించేందుకు ప్రయత్నించారు.  

మాలోకం పరిస్థితి ఎంటో!
మంగళగిరిలో పార్టీ పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. గంజి చిరంజీవి, మరికొందరు టీడీపీని వీడిన తర్వాత లోకేశ్‌ భవితవ్యం ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఎలా గెలవాలో తెలియని ఆందోళన ఓ వైపు పీడిస్తుండగా.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెట్టడం మైనస్సేనని కార్యకర్తలు కుండబద్ధలు కొడుతున్నారు. 

ఉమ్మడి కృష్ణాలో ఎదురీత 
► ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ముఖ్య నాయకులు కాడి వదిలేశారు. తమకు పట్టుందని చెప్పుకునే జిల్లాలోనే ఆ పార్టీ నేతలు ఎదురీదుతున్నారు. విజయవాడలో ఉన్న నేతలంతా ఎవరికి వారు సొంత గ్రూపులు పెట్టుకుని రచ్చ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు.  

► అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడు మైలవరంలో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతాననే భయంతో పక్క నియోజకవర్గాల వైపు తొంగి చూస్తున్నారు.   

► విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేసి తాను మళ్లీ పోటీ చేయనని చెబుతున్నారు. కేశినేని నానికి పొగ పెట్టేలా బుద్ధా వెంకన్న, బొండా ఉమా తదితర నేతలు ఆయన తమ్ముడు కేశినేని శివనాథ్‌ను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి తీసుకువచ్చారు.  

► బందరు ఎంపీగా ఓటమిపాలైన కొనకళ్ల నారాయణ ఈసారి పెడన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తుండడంతో కాగిత వెంకట్రావు కుమారుడు కృష్ణప్రసాద్‌ కారాలు, మిరియాలు నూరుతున్నారు. వారి మధ్య సయోధ్య కుదర్చలేక చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నారు. పామర్రులో మాజీ ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పనను పక్కకు తప్పించి, వర్ల రామయ్య కుమారుడు కుమార్‌ రాజాను ఇన్‌ఛార్జిగా నియమించినా అక్కడ క్యాడర్‌లో అయోమయం తొలగలేదు. 

► గుడివాడ, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో టీడీపీ కుంటుకుంటూ నడుస్తోంది. వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యాక ఇప్పటి వరకు గన్నవరానికి సరైన ఇన్‌ఛార్జిని నియమించలేకపోయారు. గుడివాడలో కొడాలి నానిని ఎదుర్కొనే నేత కోసం చంద్రబాబు అన్వేషణ కొనసాగుతూనే ఉంది. రావి వెంకటేశ్వరరావు, మరికొందరు నేతలను పని చేయిస్తున్నా, వారు నానిపై పోటీకి సరిపోరని అక్కడి క్యాడర్‌ తెగేసి చెబుతోంది. నూజివీడు, తిరువూరులోనూ ఆ పార్టీని నడిపించే నాథులు లేరు. 

పూర్వపు పశ్చిమలో నాయకత్వం కరువు  
► ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ టీడీపీని నాయకత్వ సమస్య వేధిస్తోంది. గతంలో జిల్లాను నడిపించిన మాగంటి బాబు, సీతారామలక్ష్మి వంటి నేతలు ప్రస్తుతం స్తబ్దుగా ఉంటున్నారు.  

► మిగిలిన చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు చురుగ్గా లేకపోవడం, బలహీన నాయకులు కావడంతో పార్టీ కార్యక్రమాలేవీ జరగడంలేదు. ఉండి 
నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజు ఒక గ్రూపుగా, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మరో గ్రూపుగా మారడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.  

► కీలకమైన భీమవరంలో ఆ పార్టీకి పూర్తి స్థాయి ఇన్‌ఛార్జి లేక పరిస్థితి దయనీయంగా ఉంది. మాజీ ఎంపీ సీతారామలక్ష్మిని ఇన్‌ఛార్జిగా పెట్టినా అది కంటి తుడుపు చర్యేనని పార్టీ నాయకులు వాపోతున్నారు. చింతలపూడికి మాజీ మంత్రి పీతల సుజాత దూరమవడంతో ఇప్పుడు అక్కడ ఇన్‌ఛార్జి లేరు. ద్వితీయ శ్రేణి నాయకులతోనే పార్టీ నడుస్తోంది. నర్సాపురం, కైకలూరు, పోలవరం, ఏలూరు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీని నాయకత్వ సమస్య పీడిస్తోంది. కైకలూరు ఇన్‌ఛార్జి జయమంగళ వెంకట రమణ రెండు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీలో చేరడంతో అక్కడ టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement