సాక్షి, అమరావతి: ఊరూవాడా పూజలందుకునే వినాయకుడి పందిళ్ల వద్ద వేలాది రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటవుతున్నాయి. ఆయా పందిళ్ల వద్ద నిరంతరం స్వామి పాటలు వినిపించాలన్నా, పూజా మంత్రాలు భక్తులకు చేరాలన్నా.. లౌడ్ స్పీకర్లు, మైకులు తప్పనిసరి. అదేవిధంగా పెద్దపెద్ద మండపాల వద్ద ఏసీలు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రత్యేక విద్యుత్ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నిటికీ కరెంటు అవసరం.
ఈ కరెంటు విషయంలో అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే వినాయక చవితికి విద్యుత్ శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భద్రతకు చర్యలు చేపట్టింది. ఆ వివరాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీ కె.సంతోషరావు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డి ‘సాక్షి ప్రతినిధి’కి వెల్లడించారు. వారు చెప్పినదాని ప్రకారం..
► వినాయక ఉత్సవాల్లో విద్యుత్ శాఖకు సంబంధించిన అన్నిరకాల సేవలను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలోను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించారు. వీరు డివిజనల్ ఇంజనీర్లతో సమన్వయం చేసుకుంటారు.
► క్షేత్రస్థాయిలో నిర్వాహకులు, భక్తులకు సహకరించడం, విద్యుత్ సర్వీస్, ప్రమాదాలపై వారికి అవగాహన కల్పించడం కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన బృందాలు ప్రతి మండపం వద్దకు తిరుగుతూ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు చెబుతుంటాయి.
► ప్రతి మండలానికి ఒక సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ అందుబాటులో ఉంటారు. ఏదైనా పెద్ద సమస్య ఏర్పడితే ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు.
► మండపంలో విద్యుత్ కోసం ముందుగా విద్యుత్ శాఖ నుంచి లోడ్ ప్రకారం నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి పొందాలి. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారికి ఎలక్ట్రికల్ ఇంజనీర్లు విద్యుత్ ప్రమాదాలపై పలు సూచనలు చేస్తున్నారు.
► మండపంలో ఉండే విద్యుత్ పరికరాల లోడ్‌కు తగిన నాణ్యమైన కేబుల్స్ వాడాలి. జాయింట్లు ఉన్న, ఇన్సులేషన్‌లేని వైర్లను వాడటం అపాయకరం. వైరింగ్‌ను లైసెన్స్ కలిగిన ఎలక్ట్రీషియన్ చేత మాత్రమే చేయించుకోవాలి. ముఖ్యంగా లోడ్‌కు తగిన కెపాసిటీ కలిగిన ఎంసీబీ (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్)లను తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ ఎంసీబీలు ఓవర్ లోడ్ అయితే షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదాలు జరగవచ్చు.
► విద్యుత్ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గణేష్ మండపాలను ఏర్పాటు చేయరాదు. విద్యుత్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్ల దిమ్మెలను మండపాలకు సపోర్ట్ కోసం వాడరాదు. విద్యుత్ వైర్లు, పోల్స్, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు మండపాల పరిసరాల్లో ఉంటే వాటిని పరిశీలించి వాటి నుంచి దూరంగా ఉండాలి.
► వినాయక మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం విద్యుత్ స్తంభాలు ఎక్కకూడదు. విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదిస్తే వారు మండపం వద్దకు వచ్చి పరిశీలించి కనెక్షన్ ఇస్తారు.
► ఒకవేళ ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినా, విద్యుత్ లైన్లు ఎక్కడైనా తెగిపడినా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు గానీ, సమీప ఫ్యూజ్ ఆఫ్ కాల్‌కు గానీ కాల్‌చేసి విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.
Ganesh Chaturthi 2022: 'పండుగ వేళ..' కరెంటుతో జాగ్రత్త
Published Wed, Aug 31 2022 5:14 AM | Last Updated on Wed, Aug 31 2022 12:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment