సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగు జగనన్న కాలనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ ప్రభుత్వం పేదలకు గడ్డమణుగులో ఇళ్ళ స్థలాలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా అక్కడ మెరకను చదును చేసే పనులు కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దేవినేని ఉమా అటవీ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ అసత్యపు ప్రచారం సాగించారు.
50 మందికి పైగా తన అనుచరులతో ఇళ్ల స్థలాల వద్దకు చేరుకున్న ఉమా.. నియోజకవర్గ ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి ఉమాని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉమా తనపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ అసత్యపు ఆరోపణలు చేస్తూ కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇరువర్గాలు స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే గతంలో అదే అటవీ ప్రాంతంలో ఉమా అక్రమ మైనింగ్ చేశాడని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.
అర్ధరాత్రిదాకా కొనసాగిన ఉద్రిక్తత
జీ.కొండూరులో అర్ధరాత్రి ఒంటిగంట దాకా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఉమ ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున గ్రామానికి తరలిరాగా పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దేవినేని ఉమ అరెస్ట్
దేవినేని ఉమను అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తిరువూరు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. జీ.కొండూరు వివాదానికి మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రదాన కారణమని ఏలూరు రేంజ్ డిఐజి మోహన రావు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌లు తెలిపారు. దేవినేని ఉమ దురుద్దేశపూర్వకంగా.. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే జి.కొండూరు వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించినందున మాజీ మంత్రి దేవినేని ఉమపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసుని పూర్తి పారదర్శకంగా విచారణ చేస్తున్నామన్నారు. దేవినేని ఉమపై పోలీసులకి ఫిర్యాదు కూడా అందిందన్నారు.
దేవినేని అబద్దపు ప్రచారాలు బట్టబయలు
జి.కొండూరు వివాదంలో దేవినేని అబద్దపు ప్రచారాలు బట్టబయలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ దాడి విజువల్స్‌ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బయటపెట్టారు. జి.కొండూరుకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత పాలడగు దుర్గా ప్రసాద్ కారును, మరో దళిత కార్యకర్త సురేష్ పైనా టీడీపీ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాళ్లు, కర్రలతో కొట్టాలంటూ దగ్గరుండి టిడిపి కార్యకర్తలని దేవినేని ఉమా రెచ్చగొట్టారు. రెండుసార్లు టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి ప్రయత్నించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ తనపైనే దాడి జరిగిందంటూ పచ్చమీడియా సహకారంతో దేవినేని ఉమ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పచ్చమీడియాలో చూపిన కారు తమదేనని.. తమపైన దాడి విజువల్స్‌ని దేవినేనిపై దాడిగా చూపించారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment