మైలవరంలోని జమలయ్య ఇంట్లో చెదలు పట్టి చినిగిపోయిన నోట్లు
సాక్షి, మైలవరం : కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయినీ కూడబెట్టాడు. అలా ఐదు లక్షలు జమచేశాడు. బ్యాంకు ఖాతా లేదు.. ఇంట్లో వాళ్ల మీద నమ్మకంలేదు.. ఇక ఎక్కడ దాచుకోవాలో తెలీక ఇంట్లో మూలనున్న ట్రంకు పెట్టెలోనే భద్రం చేశాడు. అదే అతనికి చేటు చేసింది. కష్టార్జితం అంతా చెదల పాలైంది. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్లంతా లబోదిబోమంటున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలివీ.. మైలవరం–విజయవాడ రోడ్డులోని వాటర్ ట్యాంక్ వద్ద ఉంటున్న బిజిలీ జమలయ్య పందుల వ్యాపారి. తనకొచ్చే ఆదాయాన్ని కొద్దికొద్దిగా కూడబెడుతూ వచ్చాడు.
బ్యాంకు ఖాతా లేకపోవడం.. ఇంట్లో వారి మీద నమ్మకం లేకపోవడంతో దాచుకుంటున్న సొమ్మును ఇంట్లోని ఓ ట్రంకు పెట్టెలో భద్రపరిచాడు. అలా రూ.5లక్షలు పోగుచేశాడు. ఇంకో ఐదు లక్షలు కలిపి సొంతిల్లు కట్టుకుందామనుకున్నాడు. ఇంతలో లక్ష రూపాయల అవసరం ఏర్పడింది. దీంతో ట్రంకు పెట్టె తెరిచి షాకయ్యాడు. ఎంతో భద్రంగా దాచుకున్న నోట్లకు చెదలు పట్టడం చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయాన్నే కుటుంబ సభ్యులు నోట్ల కట్టలు తీసి మంచంపై వేసి లెక్కపెట్టడం ప్రారంభించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో పోలీసులు రంగంలోకి దిగి జమలయ్య ఇంటికి వెళ్లి అంత సొమ్ము ఎలా వచ్చిందంటూ ఆరా తీశారు. పోలీసులను చూడగానే కుటుంబ సభ్యులు బావురుమంటూ తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment