సాక్షి, అమరావతి: బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడట! చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్ధాలు వల్లిస్తే రాజగురువు రామోజీ తాటికాయంత అక్షరాలతో ముద్రించి మురిసిపోయారు! సలహాదారుల పేరుతో 89 మందిని నియమించారని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.680 కోట్లు వ్యయం చేసిందని.. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే రూ.140 కోట్లు చెల్లించారంటూ నాదెండ్ల గాలి కబుర్లు చెప్పారు.
అసలు ప్రభుత్వం నియమించిందే 46 మంది సలహాదారులైతే మిగతావారంతా ఎక్కడి నుంచి వచ్చినట్లు? నాదెండ్ల ఆరోపణల్లో నిజం లేదని ఇక్కడే తేలిపోతోంది. నెలకు రూ.లక్షన్నర లోపే జీతభత్యాల రూపంలో చెల్లిస్తుండగా ఏకంగా రూ.వందల కోట్లు ఇస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచురించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏ హోదాలో సలహాదారులను నియమిస్తోంది? వారికి వేతనాలు, భత్యాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారు? అనే వివరాలు జీవోల రూపంలో పారదర్శకంగానే ఉన్నా గోప్యంగా దాచిపెడుతున్నట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడుతోంది. 2023–24లో మంత్రులు, చైర్మన్లు, సలహాదారుల కోసం బడ్జెట్ కేటాయింపులే రూ.29.61 కోట్లు అయినప్పుడు ఒక్క సలహాదారులకే రూ.వందల కోట్లు చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది.
♦ రాష్ట్రప్రభుత్వం ఐదు కేటగిరీలుగా సలహాదారులను నియమిస్తోంది. కేటగిరీ ‘ఎస్’ కింద నియమితులైన వారికి క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది. వారికి సిబ్బంది కానీ జీతభత్యాలు కానీ ఉండవు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న సలహాదారులకు క్యాబినెట్ మంత్రులతో సమానంగా వసతులు క ల్పిస్తారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎలాంటి గౌరవ వేతనాలు లేకుండా సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు.
♦చంద్రబాబు అధికారంలో ఉండగా రాజధాని డిజైన్ల పేరుతో ప్రచార ఆర్భాటం కోసం కన్సల్టెన్సీలు, సలహాదారులకు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని గుమ్మరించారు. నార్మన్ ఫోస్టర్, సుర్బానా జురాంగ్ తదితర కన్సల్టెన్సీ సంస్థలు ఈ జాబితాలోనే ఉన్నాయి.
పోలవరం సందర్శన పేరుతో చంద్రన్నకు జయము జయము అంటూ సొంత ప్రచారం కోసం బస్సుల్లో జనాన్ని తరలించేందుకు డబ్బులను నీళ్లలా ఖర్చు చేశారు. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో షూటింగ్‌లను తలపిస్తూ సినీ దర్శకుడితో డ్రోన్లతో చిత్రీకరణకు విచ్చలవిడిగా ఖర్చు చేయడంతోపాటు అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న రామోజీగానీ నాదెండ్లగానీ అప్పుడు నోరెత్తితే ఒట్టు!.
ఫేక్ ప్రచారం
ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న టీడీపీకి ఈసారి కూడా ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయమని, శాశ్వత సమాధి తప్పదని వైఎస్సార్‌సీపీ శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొంది. సలహాదారులకు రూ.వందల కోట్లు చెల్లిస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను వల్లిస్తున్నారని మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment