ప్రమాదానికి కారణమైన బొలేరొ ట్రక్కు
సాక్షి, దెందులూరు (పశ్చిమ గోదావరి): జాతీయ రహదారిపై దెందులూరు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. గుండుగొలనులోని రామాలయం వీధికి చెందిన బాలిన నరేంద్ర (25), పరసా రామకృష్ణ (25), వెలివల గాంధీ (25) స్నేహితులు. రామకృష్ణకు బొలెరో వాహనం ఉండగా, నరేంద్ర, గాంధీ ఆప్టింగ్ డ్రైవర్లు. మంగళవారం రాత్రి వీరు బోలెరో వాహనంలో ఏలూరు వెళ్లి అనంతరం తిరుగుప్రయాణమయ్యారు. దెందులూరు వద్ద పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి వాహనం టైరు పంక్చరైంది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్ పైనుంచి ఎగిరి అవతలి రోడ్డులో హైదరా బాద్ వెళుతున్న ఇంద్ర బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై డి.రామ్‌కుమార్, ఆర్టీసీ డీఎం సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సహాయంతో వెలికి తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
భోజనానికి వస్తారని ఎదురుచూస్తున్నాం..
‘భోజనానికి వస్తామని ఫోన్ చేశారు. భోజనం సిద్ధం చేశాం. ఇంకా రాలేదని ఎదురుచూస్తుండగా విషాద వార్త విని హతాశులయ్యాం. బిడ్డల మృతి కడుపు కోతను మిగిల్చింది’ అంటూ వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రామకృష్ణ ఇంటిలోని వ్యాన్ తాళం తీసుకుని బయటకు వెళ్తూ వెంటనే వచ్చేస్తాను, భోజనం రెడీగా ఉంచమ్మా అంటూ పరసా రామకృష్ణ అనగా, బాలిన నరేంద్ర భోజనం వద్ద కూర్చున్నవాడే లేచి వెళ్లిపోయాడు. గాంధీ కూడా భోజనం సిద్ధంగా ఉంచామని తల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఈ ముగ్గురు రాత్రి 10.30 గంటల వరకు గ్రామంలో అందరితో కలిసి తిరిగారు. తరువాత వీరు బొలెరో వ్యాన్‌పై ఏలూరు వెళ్లారు. తిరిగి తమ ఇంటికి మరో కొద్ది నిమిషాల్లో చేరుకునే లోపే మృత్యు ఒడికి చేరారు.
లేకలేక పుట్టాడు..
గౌడపేటకు చెందిన బాలిన శ్రీనివాసరావు, ధర్మావతి దంపతులకు వివాహం తర్వాత చాలాన్నాళ్లకు లేకలేక బాలిన నరేంద్ర పుట్టాడు. అతనిని అల్లారుముద్దుగా పెంచారు. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్ల కితం వివాహం కాగా, భార్య గర్భిణి. నరేంద్ర ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బిడ్డ మృతితో కుటుంబసభ్యులు గుండెలావిసేలా రోధించారు. తల్లిదండ్రులు రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. బడ్టీ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నారు.
చేదోడువాదోడుగా..
పరసా రంగారావు, వెంకటలక్ష్మీలకు రెండో సంతానం పరసా రామకృష్ణ బొలెరో వాహనంపై చేపల వ్యాపారం చేస్తుంటాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదంలో వాహనం నడుపుతూ ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
చిన్నోడు తెలివైనోడు..
వెలివెల సుబ్బారావు, నాగలక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో చిన్నవాడైన వెలివెల గాంధీ అప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తెలివైన వాడు కావడంతో ఆ కుటుంబమంతా అతనిపైనే ఆశలు పెట్టుకుంది. రోడ్డు ప్రమాదంలో కుమా రుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment