ద్వారకా తిరుమల(ఏలూరు జిల్లా): చిన వేంకన్న క్షేత్రం ద్వారకా తిరుమలలో శ్రావణ మాస పెళ్లిసందడికి తెర పడింది. ఆదివారం ఉదయం 8.39 గంటలదే శ్రావణంలో చివరి ముహూర్తం. ఈ ముహూర్తంలో కొన్ని వివాహాలు జరిగినా.. శనివారం రాత్రి ముహూర్తం శ్రావణ మాసంలో అతి పెద్దది కావడంతో క్షేత్రంలో 300కు పైగా వివాహాలు జరిగాయి. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది.
చదవండి: కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా?
రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఎటు చూసినా పెళ్లివారే కనిపించారు. కొండ పైన, దిగువన ఉన్న కల్యాణ మంటపాలు, తూర్పు రాజగోపుర ప్రాంతంలోని అనివేటి మంటపం, పాదుకా మంటపం వద్ద ఉన్న స్వామివారి కల్యాణ మంటపంలో, చివరకు ఆలయ ప్రధాన రాజగోపుర మెట్ల మార్గం, తూర్పు రాజగోపుర ప్రాంతంలో నేలపై సైతం వివాహాలు జోరుగా జరిగాయి. స్వామి సన్నిధిలో కాస్త జాగా దొరికితే చాలు.. ఏదోలా పెళ్లి చేసుకుని వెళ్లిపోదామని పెళ్లి బృందాల వారు ఆతృత పడ్డారు. పెళ్లివారి వాహనాలతో ఘాట్ రోడ్లన్నీ కిక్కిరిశాయి. క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్సై టి.సుదీర్ సిబ్బందితో కలసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
మొత్తంగా శ్రావణ మాసంలో శ్రీవారి క్షేత్రంలో సుమారు 2 వేల వివాహాలు జరిగాయి. దేవస్థానానికి కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. స్వామి సన్నిధిన వివాహాలు చేసుకున్నవారే కాకుండా ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. సత్రం గదుల్లో చాలావరకూ పెళ్లిబృందాల వారే రిజర్వ్ చేసుకున్నారు.
పెళ్లిళ్లకు మూడు నెలలు బ్రేక్..
శ్రీవారి క్షేతంల్రో వివాహాలు జరగాలంటే మార్గశిర మాసం వరకూ అంటే డిసెంబర్ రెండో తేదీ వరకూ ఆగాల్సిందే. ఆదివారంతో శ్రావణ మాసంలోని వివాహ ముహూర్తాలు ముగిశాయి. 28 నుంచి భాద్రపదం శూన్యమాసం. ఆ తరువాత సెప్టెంబర్ 18 నుంచి శుక్ర మౌఢ్యమి కావడంతో నవంబర్ 27 వరకూ వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లిళ్లు జరుపుకొనేందుకు అనేక మంది తొందరపడ్డారు. దీంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. డిసెంబర్ 2 నుంచి 19వ తేదీ వరకూ మళ్లీ పెళ్లి ముహూర్తాలున్నాయి. ఆ తరువాత పుష్యమాసం కావడంతో డిసెంబర్ 24 నుంచి జనవరి 21 వరకూ ముహూర్తాలు లేవు. తిరిగి జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న మాఘమాసంలో, తరువాత ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమవుతున్న ఫాల్గుణంలో వివాహాలు జరగనున్నాయని పండితులు తెలిపారు.
కొత్త జంటలతో క్షేత్రం కళకళ
కొత్త జంటలతో శ్రీవారి క్షేత్రం కళకళలాడింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా వివాహాలు జరిగాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి కొత్త జంటలు, వారి బంధువులతో కలసి ఆలయానికి తరలి వచ్చారు. ఆలయం వద్ద ఎటు చూసినా నూతన వధువరులే కనిపించారు. దీనికితోడు ఆదివారం సెలవు కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment