తిరుమల: వడ్డికాసుల వాడికి భక్తులు సోమవారం భారీగా రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఒకరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటటం ఇది రెండోసారి. 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు హుండీలో లభించాయి. కరోనా తరువాత ఈ సంవత్సరం నుంచి సర్వదర్శనానికి భక్తులందరికీ అవకాశం కల్పించడంతో.. గత రెండేళ్లుగా తిరుమలకు రాలేని భక్తులు స్వామిని దర్శించుకుని భారీగా హుండీ కానుకలు సమర్పించుకుంటున్నారు. టీటీడీ అధికారికంగా మంగళవారం హుండీ కానుకల లెక్కను ప్రకటించనుంది.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,682 మంది స్వామిని దర్శించుకున్నారు. 37,447 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.9 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్‌లు నిండాయి.
Comments
Please login to add a commentAdd a comment