తిరుపతి: తిరుమలలో మంగళవారం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా మంగళవారం పౌర్ణమి గరుడసేవ ఉండదని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని తెలిపింది.
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో అభివృద్ధి పనులతో పాటు మరిన్ని అంశాలపై పాలకమండలి చర్చించనుంది. ఈ సమావేశానికి టీటీడీ బోర్డు సభ్యులు హాజరుకానున్నారు.
సర్వదర్శన టోకెన్ల జారీ పూర్తి
ఈ నెల 23 నుంచి 2024, జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్ల జారీని సోమవారం టీటీడీ పూర్తి చేసింది. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్‌లో 90 కౌంటర్లలో 10 రోజులకు గాను నాలుగు లక్షలకుపైగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను భక్తులకు అందించారు. తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరు.
Comments
Please login to add a commentAdd a comment