ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం | Today Tirumala Srivari Brahmotsavam Celebrations | Sakshi
Sakshi News home page

పెద్దశేష వాహనంపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు

Published Sat, Sep 19 2020 6:54 PM | Last Updated on Sat, Sep 19 2020 9:09 PM

Today Tirumala Srivari Brahmotsavam Celebrations - Sakshi

సాక్షి, తిరుమల: దేవదేవుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూసేవారు. కలియుగ వైకుంఠంలో శ్రీవారి ఉత్సవాలను కనులారా తిలకించేందుకు వడివడిగా తిరుమల గిరులు చేరుకునేవారు. ఉత్సవాల్లో రోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ఎప్పుడు బ్రహ్మోత్సవాలు నిర్వహించినా అలాంటి పరిస్థితే తెరపైకి వచ్చేది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జనరద్దీని కట్టడి చేసేందుకు తిరుమల–తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే నిర్వహించాలని తలపెట్టింది.

తిరుమల చరిత్రలోనే తొలిసారి కోవిడ్‌ కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది. అందులో భాగంగానే అర్చకులు గరుడ ధ్వజ పటాన్ని ధ్వజ స్తంభంపై ఎగురవేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానము.. శాస్రో‍్తక్తంగా అత్యంత వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవారి ఆలయం ముందు ఎల్‌సీడీల ద్వారా భక్తులకు వీకక్షించే సౌకర్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు భక్తులకు దర్శనం ఇవ్వనన్నారు.

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు శ‌ని‌వారం సాయంత్రం 6.03 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి.  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ గోవిందాచార్యులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, స‌ప్త‌మ‌రుత్తులను(దేవ‌తాపురుషులు), రుషిగ‌ణాన్ని, స‌క‌ల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గ‌రుడాళ్వార్ ధ్వ‌జ‌స్తంభాన్ని అధిరోహిస్తార‌ని ప్రాశస్త్యం. 

కాగా ధ్వ‌జ‌ప‌టంపై గ‌రుడునితోపాటు సూర్య‌చంద్రులకు కూడా స్థానం క‌ల్పించ‌డం సంప్ర‌దాయం. ఈ సంద‌ర్భంగా పెస‌ర‌ప‌ప్పు అన్నం(ముద్గ‌ర‌) ప్ర‌సాద వినియోగం జ‌రిగింది. ఈ ప్ర‌సాదం స్వీక‌రించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంప‌ద‌లు స‌మ‌కూరుతాయ‌ని విశ్వాసం. అదేవిధంగా, ధ్వ‌జ‌స్తంభానికి క‌ట్టిన ద‌ర్భ అమృత‌త్వానికి ప్ర‌తీక‌. పంచ‌భూతాలు, స‌ప్త‌మ‌రుత్తులు క‌లిపి 12 మంది దీనికి అధిష్టాన దేవ‌త‌లు. ఇది స‌క‌లదోషాల‌ను హ‌రిస్తుంది. ద‌ర్భ‌ను కోసేట‌ప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేట‌పుడు ధ‌న్వంత‌రి మంత్ర పారాయ‌ణం చేస్తారు. ధ్వ‌జారోహ‌ణం అనంత‌రం తిరుమ‌ల‌రాయ మండ‌పంలో ఆస్థానం చేప‌ట్టారు.

ధ్వ‌జారోహ‌ణ ఘ‌ట్టానికి ముందుకు సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ కుమార‌గురు, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement