నవఖండ్రవాడ వద్ద పీబీసీలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు
పిఠాపురం: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రంలో ఆదివారం ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతిచెందగా, ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన సుమారు 70మంది యువకులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. ఉప్పాడ సమీపాన హార్బర్ నిర్మాణ స్థలం వద్దకు విగ్రహాన్ని తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.
విగ్రహం మళ్లీ వెనక్కి కొట్టుకు రాసాగింది. ఈ విషయాన్ని గమనించిన చింతపల్లి సతీ‹Ùరెడ్డి, తమిలిశెట్టి విజయవర్ధనరెడ్డి, అనిశెట్టి వెంకటరెడ్డిలతోపాటు మరో ముగ్గురు యువకులు విగ్రహాన్ని తిరిగి లోపలకు నెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సముద్ర ఉధృతి ఎక్కువగా ఉండడంతో విగ్రహంతోపాటు వారిని కూడా కెరటాలు ఒక్కసారిగా సముద్రంలోకి లాగేశాయి.
భయంతో కేకలు వేస్తున్న వారిని అక్కడే ఉన్న మత్స్యకారులు గమనించి బోటుపై వెళ్లి ఆరుగురిలో నలుగురు యువకులను రక్షించి ఒడ్డుకు తీసుకు వచ్చారు. ఆ నలుగురిలో అనిశెట్టి వెంకటరెడ్డి అలియాస్ వంశీరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. చింతపల్లి సతీ‹Ùరెడ్డి, తమిలిశెట్టి విజయవర్ధనరెడ్డి ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనాస్థలాన్ని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ పరిశీలించారు.
మరో ఇద్దరి గల్లంతు
ఇదిలా ఉండగా, వినాయక నిమజ్జనం చేస్తుండగా కాకినాడ జిల్లా పిఠాపురం శాలిపేటకు చెందిన ఇద్దరు గల్లంతయ్యారు. నవఖండ్రవాడ వద్ద పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ)లో వినాయక విగ్రహ నిమజ్జనం కోసం విగ్రహాన్ని దించుతుండగా ఐదుగురు వ్యక్తులు కాలువ ఉధృతికి కొట్టుకుపోయారు. వారిలో ముగ్గురిని స్థానికులు రక్షించారు. జోగా కుమారస్వామి (36), దోసూరి నరసింహాచారి (35) గల్లంతయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment