అమ్మమ్మ నూర్జహాన్‌తో ఖాసిఫ్
బి.కొత్తకోట: ‘అమ్మమ్మా.. నాన్నెక్కడ, సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఎక్కడికి వెళ్లాడు చెప్పు’ అంటూ ప్రశ్నిస్తున్న మనవడు ఖాసిఫ్(11)ను చూస్తూ అమ్మమ్మ నూర్జహాన్ కుమిలిపోతోంది. కర్నూలు జిల్లా వెల్దుర్ది మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. కుటుంబాన్ని పోగొట్టకుని గాయాలతో బయటపడిన ఖాసిఫ్ బుధవారం రాత్రి బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట ఉమాశంకర్‌కాలనీలోని అమ్మమ్మ నూర్జహాన్ ఇంటికి చేరుకున్నాడు.
అప్పటి నుంచి నాన్న దస్తగిరి కోసం కలవరిస్తున్నాడు. తల్లి అమ్మాజాన్ ఉపాధి కోసం రెండేళ్లు బెహ్రాయిన్ వెళ్లింది. ఆ సమయంలో ఖాసీఫ్‌కు తండ్రితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. దస్తగిరి సైతం ఖాసిఫ్‌ను అల్లారుముద్దుగా చూసుకునేవాడు. అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడంతో ఖాసిఫ్ తల్లడిల్లిపోతున్నాడు. తల్లి, తండ్రి, అక్కలు ఈ లోకం విడిచి వెళ్లిపోయారన్న సంగతి తెలియని ఖాసీఫ్ వారికోసం ఎదురుచూస్తుంటే స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఖాసీఫ్‌ను మదనపల్లె సబ్‌కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment