ఇసుక ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది బాబూ?
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
రాష్ట్రానికి పైసా ఆదాయం రావడం లేదు
కనీసం ప్రజలకైనా మేలు జరుగుతుందా అంటే అదీ లేదు
ముందు చూపుతో స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నులు ఉంచాం
అధికారంలోకి రాగానే 40 లక్షల టన్నులు మాయం చేశారు
2019లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా పారదర్శకంగా టెండర్లు
ఏటా రూ.765 కోట్ల చొప్పున ఐదేళ్లలో ఖజానాకు రూ.3,825 కోట్ల ఆదాయం
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేశాం. ఫలితంగా ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.765 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,825 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు చంద్రబాబు హయాంలో ఈ ఆదాయం అంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఎవరెవరు ఎంత పంచుకున్నారో చెప్పగలరా?’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా, సామాన్య ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను అందుబాటులో ఉండేలా చూస్తే అవినీతి జరిగిపోయిందంటూ లేనిపోని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని నమ్మబలికి, తీరా ఇప్పుడు ఉచిత ఇసుక మచ్చుకైనా కన్పించని విధంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇసుక పాలసీపై చంద్రబాబు విడుదల చేసిన వైట్ పేపర్‌పై జగన్ ఫ్యాక్ట్ పేపర్ ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే..
ఏ రేటుకు అమ్మాలో పత్రికల్లో ప్రచారం చేసే వాళ్లం
ఉచిత ఇసుక పేరిట జరిగిన దోపిడీకీ అడ్డుకట్ట వేస్తూ 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అత్యంత పారదర్శకంగా ఇసుక పాలసీని తీసుకొచ్చాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా టెండర్లు పిలిచాం. ఈ టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు. చంద్రబాబు, రామోజీ మనుషులే కాదు.. ఎవరైనా నేరుగా పాల్గొనే అవకాశం ఉంది. 2 కోట్ల మెట్రిక్ టన్నుల మినిమమ్ గ్యారంటీ పెడుతూ ఏటా రూ.765 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కట్టేలా చర్యలు తీసుకున్నాం. ఫలితంగా ఐదేళ్లలో రూ.3,825 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.
పైగా ప్రతి టన్నుకు రూ.375 చొప్పున ముందుగా ప్రభుత్వానికి రాయిల్టీ చెల్లించిన తర్వాతే ఇసుక తవ్వే కార్యక్రమం చేపట్టాం. ఇలా తవ్విన ఇసుకను రీజనబుల్ ట్రాన్స్‌పోర్టు చార్జీతో కలిపి ఏ నియోజకవర్గంలో ఏ రేటుకు విక్రయించాలో ప్రజలందరికీ తెలిసేలా ప్రతి ఆదివారం పత్రికల ద్వారా ప్రచారం చేశాం. నిర్దేశించిన ధరకు ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాం. తప్పు చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా అంటూ ప్రతి వారం పత్రికల్లో ప్రచారం చేశాం.
40 లక్షల టన్నుల ఇసుక కాజేశారు
వర్షా కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ముందు చూపుతో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేస్తే ఎన్నికల్లో ఆ యార్డుల వద్దకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ వెళ్లి సెల్ఫీలు దిగారు. ఇసుకగుట్టలు చూపించి లేనిపోని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడా ఇసుక గుట్టలు, కొండలు ఏమైపోయాయి? అధికారంలోకి వచ్చీ రాగానే ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు మనుషులు ఎడాపెడా అమ్మేసుకున్నారు. వాళ్లపై యాక్షన్ తీసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా?
ఈ రోజు ఉచిత ఇసుక అని చెప్పిన చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇచ్చిన రేటు కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. వైఎస్సార్‌సీపీ హయాంలో టన్నుకు రూ.375 చొప్పున ఏటా రూ.765 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తే నేడు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. అలాగని ఉచిత ఇసుక అమలవుతుందా.. అంటే అదీ లేదు. ఎడాపెడా దోచుకుంటున్నారు. ఇసుక రేట్లు చూస్తుంటే వైఎస్సార్‌సీపీ హయాంలోనే మేలు.. అప్పుడే రేట్లు తక్కువగా ఉన్నాయని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. ఎక్కడా స్టాక్ లేదు. దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. కళ్లెదుట దోపిడీ కనిపిస్తుంటే వేరొకరిపై వేలెత్తి చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment