సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ.. రాష్ట్రంలో ఇసుక దొరకట్లేదు, పనుల్లేక కార్మికులు అల్లాడుతున్నారంటూ కన్నీళ్లు కార్చిన ఆషాఢభూతి లాంటి ఓ పెత్తందారుడు ఇప్పుడిక రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోందంటూ కొత్త రాగం అందుకున్నాడు! వర్షాకాలం బురదతో పోటీపడి మరీ వరుస కథనాలను అచ్చేసి మురిసిపోతున్నాడు!!
డిమాండ్‌కు అనుగుణంగానే..
రాష్ట్రంలో ఇసుక కొరత తలెత్తి నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోవాలి! పెద్ద ఎత్తున జరుగుతున్న పేదల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోవాలి. అభివృద్ధి పనులను అడ్డుకుని ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించాలి!! ఇదీ ఈనాడు ప్రణాళిక! అందులో భాగమే ఇసుక రీచ్‌లపై అబద్ధాలను పోగేసి నిత్యం తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది.
ఏటా రాష్ట్రంలో 2 కోట్ల టన్నుల ఇసుక వినియోగం నమోదవుతోంది. అందుకు అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడా ఇసుక కొరత లేదు. వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగానే డిపోల్లో నిల్వలను అందుబాటులో ఉంచుతున్నారు. పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం జీవో 71 జారీ చేయడమే కాకుండా పక్కాగా అమలు చేస్తోంది.
పక్కా పారదర్శక విధానాలు
ఇప్పుడు పారదర్శక ఇసుక విధానంతో ఏటా రూ.760 కోట్ల ఆదాయం లభిస్తోంది. టన్ను ఇసుకను రూ.475కి విక్రయిస్తుండగా రూ.375 ప్రభుత్వానికి రాయల్టీగా వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ రేటుకు అమ్మేందుకు వీలులేదు. ఇసుక రీచ్‌లు, డిపోల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే రవాణా ఖర్చులు వసూలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎంత చెల్లించాలో ప్రభుత్వమే ఈనాడు సహా అన్ని ప్రధాన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తోంది.
వినియోగదారుడు సొంతంగా సమకూర్చుకున్న వాహనం ద్వారా కూడా నిర్ణీత రుసుము చెల్లించి ఇసుకను తరలించుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రం మొత్తం జేపీ సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా జేపీ సంస్థ సమర్పించే వివరాలను గనులశాఖ అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విజిలెన్స్ స్వా్కడ్స్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)తో తనిఖీలు చేస్తున్నారు. అక్రమ ఇసుక మైనింగ్, రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించేలా చట్టం చేశారు.
నాడు ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా
గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలను ఎన్జీటీ తీవ్రంగా తప్పుబట్టింది. పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. అదే ఎన్జీటీ ఇప్పుడు ఇసుక పాలసీకి సంబంధించి తీసుకున్న చర్యలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ సర్కారు తప్పిదాలకు విధించిన రూ.వంద కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది.
ఈ విషయం ’ఈనాడు’ పత్రికకు, రామోజీరావుకు తెలియదా? లేక నటిస్తున్నారా? నాడు చంద్రబాబు సర్కారు సహజ వనరులను దోచేసింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అడ్డొచ్చిన అధికారులను జుత్తు పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ప్రభుత్వానికి రావాల్సిన రూ.4 వేల కోట్ల ఇసుక ఆదాయాన్ని మింగేసింది.
Comments
Please login to add a commentAdd a comment